News

అరుణాచలం.. రైలులోనూ వెళదాం!

526views

పంచభూతాత్మాక లింగాల్లో అగ్ని లింగం తేజోలింగంగా పేరొందిన తమిళనాడులోని అరుణాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా నుంచి అధికంగా ఉంటోంది. గిరి ప్రదక్షిణకు వేలాది మంది భక్తులు తరలి వెళుతున్నారు. కడప మీదుగా రైలు సదుపాయం ఉన్నా అవగాహన లేక భక్తులు బస్సులను ఆశ్రయిస్తుండడం విశేషం.

కడప నుంచి అరుణాచలానికి రోడ్డు మార్గాన వెళ్లేందుకు దాదాపు 300 కిలోమీటర్ల దూరం ఉంటోంది. ఆర్టీసీ బస్సుల్లో సూపర్‌ లగ్జరీలో వెళితే దూరాన్ని బట్టి రాను, పోను రూ.1050–1300 వరకు చార్జి ఉంది. ఒకవేళ కారులో వెళితే దాదాపు రూ. 8–10 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటన్నింటితో పోలిస్తే రైలులో ప్రయాణిస్తే చార్జి తక్కువగా ఉన్నా రిజర్వేషన్‌ అందుబాటులో లేకపోవడంతో అనేక మంది ఇతర వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.

అందుబాటులో రైల్వేస్టేషన్లు
ఉమ్మడి కడప జిల్లా నుంచి పలు రైళ్లు అరుణాచలం సమీపానికి వెళుతుంటాయి. కడప నుంచి విల్లుపురం 360 కిలోమీటర్ల దూరంలో ఉంది. విల్లుపురం నుంచి అరుణాచలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎవరైనా అరుణాచలం వెళ్లాలంటే విల్లుపురం వరకు రైలులో వెళ్లి అక్కడి నుంచి రైలులోగానీ, బస్సులోగానీ, ఇతర వాహనాల్లో కూడా వెళ్లవచ్చు.

● అహ్మదాబాద్‌ నుంచి తిరుచునాపల్లికి వెళ్లే వారాంతపు రైలు (09419) ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు కడపకు చేరుకుని అదేరోజు సాయంత్రం 7.15 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు (09420) మధ్యాహ్నం 12.10 గంటలకు విల్లుపురంలో బయలుదేరి కడపకు రాత్రి 8.25 గంటలకు చేరుతుంది. ఈ రైలు కడప స్టేషన్‌లో మాత్రమే ఆగుతుంది.

● అలాగే లోకమాన్య తిలక్‌–మధురై (22101) రైలు ప్రతి గురువారం తెల్లవారుజామున 5.40 గంటలకు కడపకు చేరుకుని అదేరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విల్లుపురం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో (22102) ఈ రైలు విల్లుపురంలో శుక్రవారం రాత్రి 8.40 గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారుజామన 3.08 గంటలకు కడపకు చేరుతుంది. ఈ రైలులోరానుపోను రూ. 540 ఛార్జిగా నిర్ణయించారు.

● ముంబయి–కరైకల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (11017) వారాంతపు ఎక్స్‌ప్రెస్‌గా ఆదివారం తెల్లవారుజామున 5.40 గంటలకు కడపకు చేరి మధ్యాహ్నం 1.55 గంటలకు విల్లుపురం చేరుతుంది. తిరిగి ఇదే రైలు (11018) విల్లుపురంలో సాయంత్రం 7.25 గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారుజామున 3.10 గంటలకు కడపకు చేరుతుంది.

● ముంబయి–నాగర్‌కోయిల్‌ (16351) ఎక్స్‌ప్రెస్‌ వారానికి రెండుసార్లు నడుస్తుంది. ఈ రైలు ప్రతి మంగళ, శనివారాల్లో మధ్యాహ్నం 1.20 గంటలకు కడపకు చేరుకుని విల్లుపురానికి అదేరోజు రాత్రి 9.30 గంటలకు చేరుతుంది.

● కడప నుంచి అరుణాచలానికి ఓఖా–మధురై (09520) ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులో ఉంది. ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు బుధవారం సాయంత్రం 6.05 గంటలకు కడపకు చేరి మరుసటిరోజు అరుణాచలానికి తెల్లవారుజామున 3.40 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు (09519) అరుణాచలంలో శుక్రవారం ఉదయం 7.30 గంటలకు బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 1.55 గంటలకు కడపకు చేరుతుంది. ఈ రైలులో జనరల్‌ క్లాస్‌లో రూ. 130, స్లీపర్‌లో ఒక్కొక్కరికి రానుపోను రూ.770, త్రీ టైర్‌ ఏసీలో రానుపోను రూ. 2350లుగా ఉంది.

ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి
వైఎస్సార్‌ జిల్లా నుంచి అరుణాచలం వెళ్లే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. నేరుగా వెళ్లేందుకు ఓఖా–మధురై ఎక్స్‌ప్రెస్‌, కడప నుంచి అరుణాచలం వెళ్లేందుకు సమీపంలోగల విల్లుపురం వెళ్లే రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే కడప నుంచి కాట్పాడికి వెళ్లి నేరుగా అరుణాచలం వెళ్లవచ్చు. రైల్వేశాఖ అందిస్తున్న ఈ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి.– జనార్దన్‌, కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌, కడప రైల్వే