ArticlesNews

నారీశక్తికి ప్రతీక రాణి దుర్గావతి

21views

* 500వ జయంతి సందర్భంగా సంస్మరణ

– హనుమత్ ప్రసాద్
రాణి దుర్గావతి పేరు వినగానే నారీశక్తికి వున్న గౌరవం గుర్తుకు వస్తుంది. స్వధర్మం కోసం, దేశం కోసం, మాతృ భూమి గౌరవం నిలబట్టేందుకు, పేరులోనే కాదు చేతల్లోనూ దుర్గామాత అవతారం ఎత్తిన రణచండి ఆమె. రూపంలో, గుణంలో, ధన వైభవంలో ఆమెకు ఆమె సాటి. వీర పురుషులు భరత చరితలో వున్నట్టే, వీరాంగనలు కూడా భరత చరిత్రను సాహోసోపేతంగా మలిచారు.

నిపుణత కల్గిన యోధురాళ్ళు రాణి లక్ష్మీబాయి, రాణి చెన్నమ్మ, రాణి అవంతి బాయి, అహల్యా బాయి హోల్కర్‌ సరసన రాణి దుర్గావతి చేరిపోయారు. ఆమె వనవాసుల్లో గోండు తెగకు చెందిన స్త్రీ. గోండు రాణిగా ప్రసిద్ధి కెక్కింది. జీవితంలో ఎపుడూ పరాజయం చూడని ధీరవనిత. మాతృభూమి రక్షణ కోసం అంతిమ క్షణం వరకు పోరాడిరది. మొగలులతో పోరాటంలో ఆమె అగ్రేసరురాలిగా నిలిచింది.

ఆమె బహుముఖ వ్యక్తిత్వం కలది. తన రాజ్యంలో ప్రజలకు ఆమె తల్లిలా, పరిపాలనలో చక్కటి శాసకురాలిగా, శత్రువుల పాలిట సింహాస్వప్నంలా ఆమె భాసించింది. మొగలుల పరిపాలనలో స్వాభిమానంతో జీవించడం నేరంగా వుండేది. నాడు అక్బరుకు అందరు హిందురాజులు దాసోహమన్నారు. వైధవ్యంతో ఓ రాణి చక్కటి పరిపాలన చేయడం అక్బరుకు కంటిగింపైంది.

తనను శరణువేడమన్నాడు. ససేమిరా అంది. యుద్ధంలో 3 సార్లు ఓడిపోయాడు అక్బర్. జీవిత కాలంలో ఆమె 52 యుద్ధాలు చేసింది. 51 యుద్ధాల్లో గెలిచింది. ఆమె సబల. ముస్లింల కూట యుద్ధనీతి కారణంగా ఆమె ఓడింది. శత్రువు చేతిలో తన శరీరం పడకూడదని తనకు తానుగా ఆత్మాహుతి చేసుకుంది. ఆమె సందేశం మేరకు అక్బరుకు వశం కాకుండా 5000 మంది గోండు మహిళలు ఆత్మాహుతి చేసుకున్నారు.

నారీవాహిని నిర్మాణం చేసింది. అక్బరు తరువాత యుద్ధంలో గెలిచివుండవచ్చు. కాని పరాక్రమం చూపి స్వాభిమాన సందేశం యిచ్చి జయకేతనం ఎగుర వేసింది మాత్రం రాణి దుర్గావతి. ఆమె గోండు రాణిగా కాక దేశానికే రాణి అయింది. గోండు జాతి హిందూ సమాజంలో అంతర్భాగం అని ప్రకటించింది. ఆమె గౌరవగాథ జనజీవనానికి ప్రేరణనిచ్చింది.

జబల్పూర్‌లోని దుర్గావతి పరిశోధన సంస్థ ఆమె బలిదాన స్థలం నుంచి జన్మస్థలం వరకు అనేక పురావస్తు శిధిలాలను, ఆధారాలను సేకరించి భద్రపరచింది. జబల్‌పూర్‌ విశ్వ విద్యాలయం పేరును రాణి దుర్గావతి విశ్వ విద్యాలయంగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నామాంతరం చేసింది. 1988లో కేంద్ర ప్రభుత్వం రాణి దుర్గావతి స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

ఇది సుమారు 500 సంవత్సరాల నాటి చరిత్ర. అవి దసరా నవరాత్రుల రోజులు. ఆ రోజు దుర్గాష్టమి. మహారాణి కమలాదేవి ప్రసవ వేదన పడుతున్నది. ఆమె భర్త కీర్తి దేవసింహుడు కాలింజర్‌ కోట సమీపంలో వున్న దుర్గామందిరంలో పూజ చేయించి తిరిగి వస్తున్నారు. అంతటా ఉత్సుకత నెలకొని వుంది. భావి సామ్రాజ్యాధినేత ఎవరు అవుతారో కమలాదేవి ప్రసవిస్తే తెలుస్తుంది. రాజు జ్యోతిష్యులతో మంతనాలు జరిపాడు.

ఇంతలో ఎవరో పరుగెత్తుకొచ్చారు. ‘మహారాజ జయం! మహారాణి ఒక సుందరమైన పుత్రికకు జన్మనిచ్చింది’ అని రాజు చెవినవేశారు. మహారాజు ప్రథమ సంతానం ` ఆనంద పడ్డారు. అక్కడ కూర్చున్న జ్యోతిష పండితులు, తిధి, వార, నక్షత్రముల వివరాలు తీసుకొని గుణిస్తూ, గణిస్తూ, ‘మీ ఈ పుత్రిక గొప్ప తోజోవంతమైన, ప్రజాపాలకురాలై అత్యంత గౌరవం పొందుతుంద’ని చెప్పారు.

ఆమె కీర్తి ప్రపంచ వ్యాప్తం అవుతుందన్నారు. ఆమె దాంపత్య జీవనం మాత్రం ఎక్కువ కాలం నిలవదు. కాని శ్రేష్ఠమైనది. ఆమె వ్యక్తిగత జీవనం సుఖ దుఃఖాల మయమౌతుంది’ అన్నారు. రాజు జ్యోతిష్య పండితులకు దానాలిచ్చి పంచించివేశాడు. ఆమె భవిష్యవాణి విని కొంచెం బాధపడ్డాడు. అయినా సంతోషించాడు.

దుర్గాష్టమి నాడు జననం

క్రీశ 1524 అక్టోబరు 5, దుర్గాష్ఠమి నాడు ఆమె పుట్టింది. ఉత్తర ప్రదేశ్‌లోని బాండ జిల్లాలో కాలింజర్‌ కోట అది. దుర్గాష్ఠమి నాడు పుట్టింది కనుక దుర్గావతి అని నామకరణం చేశారు. ఆమె అందమైన, శీలవంతురాలైన, యోగ్యమైన, సాహసోపేతమైన పుత్రిక. ఆమె పూర్వజూలు కూడా గొప్ప యుద్ధ వీరులు. చిన్న తనంలోనే ఆమె అస్త్ర శస్త్రాలను అభ్యసించడం మొదలయింది. కత్తి తిప్పడంలో సిద్ధ హస్తురాలైంది.

13`14 సం॥కే అడవుల్లో పడి జంతువులను వేటాడే సాహసం చేసింది. ఈ సమయంలో హిందూ రాజులు పరాక్రమం చూపినా పరాజయాల పాలవుతున్న కాలం మొదలయింది. అనేక మంది హిందూ రాజుల అస్తిత్వం ప్రశ్నార్ధకమై వారు మొగలులను శరణుజొచ్చారు. అంతా తమ ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఈ విపత్కర పరిస్థితిలో దుర్గావతి జననం కాలింజర్‌ రాజ్యంలో కొత్త ఊపిరి పోసింది.

బాల్యంలో 10 సం॥ల వయసున్నపుడు, ఒక ఏనుగు ఆ గ్రామంలో పరుగెడుతూ అందరినీ భయపెడ్తుంటే దుర్గావతి ఆ ఏనుగును పట్టుకుంది. అధిరోహించింది. నియంత్రించింది, స్వారీ చేసింది. అంతా ఆశ్చర్య పోయారు. ‘అమ్మా! నువ్వు దేవతవు తల్లీ! అంత పెద్ద ఏనుగును ఆడిస్తున్నావు’ అన్నారు. ‘ఇది మన దేవత, సైనికుడు కూడా, దీనికి భయపడడం దేనికి’ అని దుర్గావతి ప్రశ్నించింది. కొంత సేపటి క్రితం అందరినీ భయ పెట్టిన ఏనుగు యిపుడు గణేశుడుగా ఎలా మారిపోయిందా? అని అందరూ ఆశ్చర్య పడ్డారు.

ఒక రోజు దుర్గావతికి ఒక సందేశం వచ్చింది. సమీప గ్రామంలోకి ఒక సింహాం వచ్చి అనేక మందిని చంపి వేసిందన్న వార్త అది. వెంటనే దుర్గావతి తండ్రి వద్దకు వెళ్ళి ఆ సింహాన్ని చంపేందుకు తాను వెళుతున్నట్లు చెప్పింది. తండ్రి దుర్గావతి సహచరి రామచేరిని కూడా తోడు పంపాడు. ఒక ఎత్తైన ప్రదేశం నుంచి దుర్గావతి చాలాసేపు సింహం రాక కోసం నిరీక్షించింది. కాని ఎంతకీ సింహం రాక పోయేసరికి క్రిందకి దిగింది.

అనుకోకుండా సింహం ఎదుటపడే సరికి ఏ మాత్రం భయపడకుండా విల్లు ఎక్కుపెట్టి బాణం సంధించింది. ఆ బాణం సింహం మెడకు గుచ్చుకుని అది నేల కూలింది. ఈ ఘటన విషయం అందరికీ తెలిసింది. తన కూతురు ప్రావీణ్యాన్ని చూసి తండ్రి ఆనందించాడు. 500 ఏళ్ళకు పూర్వం ఆడపిల్లలకు కూడా మగ పిల్లలతో సమానంగా అటువంటి స్వేచ్ఛనివ్వడం జరిగింది.

దుర్గావతికి ఎలాంటి వరుణ్ణి తేవాలి అని తల్లిదండ్రులు ఆలోచించారు. రాజా సంగ్రామసింగ్‌ కొడుకు దళపత్‌ సింగ్ షా ప్రస్తావన వచ్చింది. ఒకసారి దుర్గావతి ఆమె సహచరి రామ్‌చేరి కలిసి దుర్గామందిరం వెళ్ళారు. మాట్లాడుకుంటూ మనీయగఢ్‌ ప్రదేశం క్రింద పారుతున్న కేన్‌ నదిని సమీపించారు. అక్కడ కొందరు భక్తులు స్నానం చేస్తున్నారు. కొందరు పాటలు పాడుతున్నారు.

ఇంతలో ఒక్కసారిగా అందరూ పరుగెత్తడం మొదలెట్టారు. తీరా చూస్తే నదికి ఆవల తీరంలో సింహం కనబడింది. కొంతసేపటికి అది అదృశ్యమైంది. మరునాడు కూడా దుర్గావతి గుడికి వెళ్ళింది. దర్శనం చేసుకుంది. తిరిగి వచ్చేటప్పుడు అడవి దారి పట్టింది. కొంతసేపటికి అడవిలో అలజడి కనబడింది. వెంటనే విల్లు ఎక్కుపెట్టి బాణం సంధించింది. బాణం అక్కడ వున్న సింహం మెడలో దూరింది.

సమఉజ్జితో వివాహం

అదే సమయంలో మరో పురుషుడు కూడా అక్కడ తిరుగాడుతూ బాణం సంధించాడు. దగ్గరికి వెళ్ళి చూశాడు. సింహం మెడలో రెండు బాణాలున్నాయి. మరొకటి ఎవరిదని ఆలోచించాడు. ఎదురుగా దుర్గావతిని చూశాడు. ఆ పురుషుడే దళ్‌పత్‌ షా. అదే సమ ఉజ్జీ అంటే. అపుడే వారిద్దరికి పరిచయమైంది. కులం, వంశం, మర్యాద వారి పరిచయానికి అడ్డు రాలేదు.

దుర్గావతి భవానీమాతను ప్రార్థించింది. ‘నాకు నువ్వే తల్లివి, నా చిన్నపుడే నా తల్లి చనిపోయింది. నాకు భారతీయ నారీ పరంపరను కొనసాగించే శక్తి నివ్వు’ అన్నది. నీ అనుమతి వుంటే, ఆశీర్వచనం వుంటే నేను దళ్‌పత్‌ షాను వివాహం చేసుకుంటాను అన్నది. గోండ్వానా రాజ్యం రాజు సంగ్రామ సింహుడ్ని తండ్రితో కూడి కలిసింది దుర్గావతి.

సంగ్రామ సింహుడు రాణి దుర్గావతి కోడలుగా రావడానికి సముఖత వ్యక్తపరిచాడు. మందిరంలో దుర్గావతి దళ్‌పత్‌ షాల గాంధర్వ వివాహం జరిగింది. తరువాత సంగ్రామ సింహుడు తమ రాజ్యంలో గౌరవంగా వారి వివాహం జరిపించాడు. వివాహం తరువాత షేర్‌షాహసూరి కలింజర్‌ మీద ఆక్రమణ చేశాడు. అపుడు దుర్గావతి గర్భవతి.

సంగ్రామ సింహుడు ఆయన అల్లుడు దళ్‌పత్‌ షాతో కలిసి షేర్‌షాహసూరి ని ఎదుర్కొన్నాడు. దీనికి యుద్ధ వ్యూహం అంతా రాణి దుర్గావతి సిద్ధం చేసింది. ఆ యుద్ధంలో షేర్‌షాహసూరి ఓడిపోయాడు. చనిపోయాడు. గోండు వంశ సంస్కారాలను విధానాలను ఆమె పుణికిపుచ్చుకుని జీవనం సాగించింది. కుమారుడు కలిగాడు. అతని పేరు వీర నారాయణ్‌.

కుమారుడు కల్గిన 2, 3 ఏళ్ళకు దళ్‌పత్‌ షా రోగగ్రస్తుడయ్యాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆయన ప్రాణం దక్కలేదు. దుర్గావతి భర్తను కోల్పోయింది. ఇదొక విచిత్ర పరిస్థితి. ఇపుడు మొగలాయిల కళ్ళు రాణి దుర్గావతి మీద పడ్డాయి. రాణి దుర్గావతి రాజ్య భారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఆమె మంత్రులు అధరకాయిసా, మన్‌ఠాకూర్‌ లు సహాయపడ్డారు.

రాజ్యం కోసం, ధర్మం కోసం సహగమనం చేయలేదు

పతి చనిపోయిన తరువాత ఆమెను సహగమనం చేయమన్నారు. కాని రాజ్యం కోసం, ప్రజల కోసం ధర్మం కోసం ఆమె ఆ పని చేయలేదు. ఆమె రక్షణ కోసం చౌరాగఢ్‌కు చేరింది. అక్కడి నుంచి రాజ్యపాలన చేసింది. ఒక విధవ, సౌందర్యవతి రాజ్యం చేస్తున్నదని తెలిసి మాల్వారాజు బాద్‌ బహుదూర్‌ ఆమె రాజ్యంపై ఆక్రమణ చేశాడు. కాని రాణి దుర్గావతి అతన్ని ఓడించింది. అతను సైన్యంతో పారిపోయాడు.

చాలామంది రాజులు ప్రయత్నం చేశారు. కాని వారు సఫలం కాలేదు. రాణి దుర్గావతి కంటె 16, 17 సం॥లు చిన్నవాడు అక్బర్. మాల్వాను అక్రమించిన తరువాత అక్బరు ఆమెను ఓడిరచాలనుకున్నాడు. తన రాజ్యానికి రాణిని చేయాలన్న చపలత్వంలో ఉన్నాడు. అక్బరు గురించి చరిత్రలో గొప్పగా చెప్పారు.

కాని అక్బర్ ఆయన సేనానులు ఏ రాజ్యంలో ఏ హిందూ మహిళ కన్పడినా తీసుకెళ్ళి రాజ భవనంలో వుంచుకునేవాడు. అంతటి దుర్మార్గుడు. అక్బరు తన సేనాపతి అసఫ్‌ అలీఖాన్‌ను పంపాడు. దుర్గావతిని శరణువేడమన్నాడు. దుర్గావతి ససేమిరా అంది. 3 సార్లు అతన్ని యుద్ధంలో ఓడిరచింది. ‘మేము ఏనాడు బానిసలుగా మారం. చివరి క్షణం వరక మేము పోరాడుతాం. మేము భారతీయ స్త్రీలం’ అని రాణి దుర్గావతి జవాబిచ్చింది.

రాణి దుర్గావతి సమకాలీనుడైన మొగలు సుచేదారుడైన మాజర్‌ఖాన్‌ గోండా రాజ్యంపై విరుచుకు పడ్డాడు. వారి వద్ద అత్యంత ఆధునిక ఆయుధాలున్నాయి. దుర్గావతి సేనాని అర్జున్‌ దాస్‌ వాస్‌ ప్రాణాలు విడిచాడు. అందువల్ల దుర్గావతి సైన్యాధిపత్యం వహించి మొగలు సేనల్ని తిప్పి కొట్టింది. మొగలు సేనలు పారిపోయారు. మొగలు సేనలపై రాత్రి వేళ యుద్ధం చేద్దామని దుర్గావతి ప్రణాళిక రచిస్తే ఆమె సహచర సైనికాధికారులు అలా వద్దన్నారు.

నాల్గవసారి అసఫ్‌ అలీఖాన్‌ పెద్ద ఎత్తున సైన్యంతో వచ్చాడు. రాణి దుర్గావతి సర్‌మన్‌ పేరు గల తన ఏనుగునెక్కి యుద్ధం చేస్తున్నది. మొగలు సేనలు పారిపోవడం మొదలైంది. రాణి సేన కూడ నేల కొరగడం మొదలయింది. ఆమె తన సేనాపతితో తనకేమైనా జరిగితే తన శరీరాన్ని మొగలులకు అప్పగించవద్దని కోరింది. ఆమె కొడుకు కూడా యుద్ధం చేస్తున్నాడు. అతనికి చాలా గాయాలయ్యాయి.

దుర్గావతి కొడుకును వేరే సురక్షిత ప్రదేశానికి తీసుకు వెళ్ళమంది. మనం ఓడిపోతే మన సైనికుల భార్యలకు సహగమనం చేసేందుకు వ్యవస్థ చేయ్యమని కొడుకుని ఆదేశించింది. ఆమె ఏనుగు రాణిమాకు రక్షణనిస్తూ, ఆమె కనబడకుండా నేలకొరిగింది. రాణి మా మెడమీద, కళ్ళ లోనూ శత్రువుల బాణములు గుచ్చుకున్నాయి. వాటిని తీసి పారవేసింది. బాహువుల మీద కూడా బాణములు గుచ్చుకున్నాయి.

రాణి దుర్గావతి అపస్మారకంలోకి వెళ్ళిన మరుక్షణం తమ వద్దకు తీసుకు రమ్మని అసఫ్‌ అలీఖాన్‌ ఆదేశించాడు. కాని రాణి మా కనిపించలేదు. ఒక గన్ను పేరు గల యోధుడు మొత్తం వొళ్ళంతా గాయాలయినాయి. అతను రాణి ఉనికి అక్బరుకు తెలియపరచాలనుకున్నాడు. రాణి దుర్గావతి వ్యూహాన్ననుసరించి జబల్‌పూర్‌కు 11 కి.మీ. దూరంలో బరేలి గ్రామం వద్ద గల కాలువను దాటి పర్వతాల పైకి వెళ్ళి ఆమె సేనలు అక్బరు సేనలతో గెరిల్లా యుద్ధం చెయ్యాలని అనుకున్నారు.

ఆ వ్యూహం తెలిసిన గన్ను అక్బరు వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు. ‘మరి దీనికి ఏం చేయాలో నువ్వే చెప్పు అని అక్బరు అతన్ని గద్దించాడు. అపుడు ఆ యోధుడు ‘కాలువ కట్టలు తెంచితే రాణి దుర్గావతి ఆమె సేనలు మీ వశమవుతాయి అని చెప్పాడు. ‘ఆ పని నువ్వే చెయ్యి’ అని అక్బరు ఆదేశించాడు. అతను వెళ్ళి ఆ కాలువ గట్లు తెంచాడు. వరద ముంచెత్తింది.

అపుడు రాణి వద్ద 300 మంది సైనికులున్నారు. అంతా మొగలు సేనల చక్రబంథంలో చిక్కుకున్నారు. రాణి దుర్గావతికి కలిగిన దెబ్బలకు రక్తం కారుతూ చివరకు శరీరంలో రక్తం కూడా తగ్గిపోతోంది. ఆమె అంతిమ ఘడియలు సమీపించి తన శిరసును ఖండించమని సైనికుల్ని ఆదేశించింది. కాని ఎవ్వరూ అందుకు సాహసించలేదు. అపుడు రాణి మా తన వొర నుంచి కత్తిని తీసి ఆత్మార్పణ చేసుకుంది.

ఈ విషయం తెలిసిన ఆమె కొడుకు వీర నారాయణ 5000 మంది గోండు వీరుల సతుల సహగమనానికి పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వ్యవస్థ చేశారు. రాణి దుర్గావతి బలిదానం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. 40 సం॥ల వయసులో ఆమె మాతృభూమి కోసం నేలకొరిగింది. జూన్‌ 24, 1564 నాడు ఆమె వీరమరణం పొందింది. జబల్‌పూర్‌కు 12 కి.మీ. దూరంలో ఆమె శవదహనం జరిగింది. ఆమె స్మారక చిహ్నం జబల్‌పూర్‌ మండల దహదారిపై భర్యాల సమీపంలోని నార్యానా వద్ద ఆమె అమరత్వం పొందిన అదే స్థలంలో నిర్మించబడింది.