News

అక్రమంగా మసీదు నిర్మాణం: కొనసాగుతున్న ‘దేవభూమి’ నిరసనలు

9views

హిమాచల్‌ ప్రదేశ్‌లోని సంజౌలీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న మసీదును కూల్చివేయాలని జరుగుతున్న నిరసనలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. దేవభూమి సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో హమీర్‌పూర్‌లో నిరసన ర్యాలీ జరిగింది. ఈ ఆందోళనలో పాల్గొన్న 46 ఏళ్ళ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సభ్యుడు గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన నిరసనకారులు, వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని నినాదాలు చేశారు.

దేవభూమి సంఘర్ష్ సమితి పిలుపు మేరకు సిమ్లా, హమీర్‌పూర్, మండీ, చంబా, నహాన్‌ జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి.హమీర్‌పూర్‌లో అధికారులకు నిరసనకారులు వినతిపత్రం సమర్పించడానికి వెళ్తుండగా, వీహెచ్‌పీ కార్యకర్త వరిందర్ పర్మార్ స్పృహతప్పి పడిపోయాడు. అతన్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

నిరసనను ఉద్దేశించి ప్రసంగించిన దేవభూమి సంఘర్ష్ సమితి కమిటీ కో-కన్వీనర్ మదన్ ఠాకూర్, వివాదాస్పద మసీదుపై అక్టోబర్ ఐదు వరకూ కోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తామన్నారు. ఆ తర్వాత భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయిస్తామన్నారు. అక్టోబర్ ఐదు తర్వాత జైల్ భరో ఉద్యమం చేపడతామని వెల్లడించారు. తమపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టిన ఏఐఎంఐఎం నేత షోయబ్ జమైపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.