News

దుర్గాపూజలకు మరింత బందోబస్తు

15views

భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌లో దసరా సందర్భంగా జరిగే దుర్గా పూజలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. అయితే ఈ రాష్ట్రానికి ఆనుకున్న ఉన్న బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న దరిమిలా, అక్కడ దుర్గాపూజలు ఎలా జరగనున్నాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత, కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం దుర్గా పూజల నిర్వహణకు పలు నియమనిబంధనలను రూపొందించింది. బంగ్లాదేశ్‌లో దుర్గాపూజల కోసం 32,666 వేదికలను ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహ్మద్ మొయినుల్ ఇస్లాం మాట్లాడుతూ గత కొంతకాలంగా జరుగుతున్న మత అల్లర్ల దృష్ట్యా, దేశంలో మరింత కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దుర్గాపూజలు మొదలుకొని, విగ్రహ నిమజ్జనం వరకు మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సైబర్ నిఘా ఏర్పాటు చేస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా నేషనల్ ఎమర్జెన్సీ సర్వీస్ 999కి డయల్ చేసి సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు.

బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ సలహాదారు మహ్మద్ జహంగీర్ ఆలం చౌదరి మాట్లాడుతూ దుర్గాపూజ వేదికల కారణంగా ముస్లిం అనుచరులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. వారి నమాజ్ ప్రారంభానికి ఐదు నిమిషాల ముందు లౌడ్‌స్పీకర్లు నిలిపివేయాలని కోరారు. బంగ్లాదేశ్ మత వ్యవహారాల సలహాదారు అబుల్ ఫైజ్ ముహమ్మద్ ఖలీద్ హుస్సేన్ మాట్లాడుతూ హిందువుల భద్రతకు తాము హామీనిస్తున్నామని అన్నారు. అక్టోబరు 3 నుంచి దుర్గాపూజలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12న ముగియనున్నాయి. అక్టోబర్ 8, 9 తేదీలలో పెద్ద సంఖ్యలో భక్తులు దుర్గాపూజలకు హాజరవుతారు.