News

పుణ్య క్షేత్రాల్లోని లడ్డూలకు పరీక్షలు

21views

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంతో.. దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాు కొలువు తీరిన పట్టణాల్లో, నగరాల్లో లడ్డూలను కొనుగోలు చేసేందుకు ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఆ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలైన మధుర, బృందావనం పట్టాణాల్లోని పలు స్వీట్ షాపుల్లోని లడ్డూలను ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యా పట్టణంలోని 15 షాపుల నుంచి 43 లడ్డూ శాంపిల్స్‌ను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు.

లడ్డూలు, కోవా, బర్పీ, మిల్క్ కేక్, రసగుల్లా, సోన్ పాపిడి తదితర పదార్థాలను లఖ్‌నవూలోని ల్యాబ్‌కు పంపినట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ కమిషనర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. దేవాలయాలు ఆ పరిసర ప్రాంతాల్లోని స్వీట్ షాపుల్లో ఈ తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు.

ప్రపంచంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో తిరుమల ఒకటి. అలాంటి తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో తిరుమల శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై సిట్‌తో దర్యాప్తు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. అలాగే తిరుమలలోని శ్రీవారి ఆలయంలో శాంతి యాగంతోపాటు సంప్రోక్షణ నిర్వహించిన సంగతి తెలిసిందే.