ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, ఆ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమేనని వెల్లడించింది. ఈమేరకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కనబెట్టింది.
ఇలాంటి తీర్పునిచ్చి హైకోర్టు ఘోరమైన తప్పిదం చేసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేంద్రానికి పలు సూచనలు చేసింది. పోక్సో చట్టంలో ‘ఛైల్డ్ పోర్నోగ్రఫీ’ అనే పదాన్ని ‘ఛైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యూసివ్ మెటీరియల్’ అనే పదంతో మారుస్తూ పోక్సో చట్టానికి సవరణలు చేయాలని పార్లమెంట్‌కు తెలిపింది. ఆ సవరణలు అమల్లోకి వచ్చేవరకు దీనిపై ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చని తెలిపింది. ఇకపై కోర్టులు ‘ఛైల్డ్ పోర్నోగ్రఫీ’ పదాన్ని ఉపయోగించవద్దని ఆదేశించింది.
ఛైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిపై క్రిమినల్ చర్యలను నిలిపివేస్తూ జనవరి 11న మద్రాసు హైకోర్టు ఆదేశాలిచ్చింది. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం.. ఛైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదంటూ ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న 28 ఏళ్ల యువకుడు వీడియోలు చూడటం తప్ప ఏమీ చేయలేదని, వాటిని ఇతరులకూ పంపలేదని పేర్కొంది. పోర్నోగ్రఫీకి అలవాటుపడిన యువతను శిక్షించడం కన్నా వారిని సరైన మార్గం వైపు నడిపించడంపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడింది.
ఈ తీర్పుపై పలు ఎన్జీవోలు, చిన్నారుల సంక్షేమ సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. వీటిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. సదరు యువకడిపై క్రిమినల్ చర్యలను పునరుద్ధరించింది.