News

హిందూ ఆలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలి : వీహెచ్‌పీ

26views

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి‌తో విచారణ చేయించి బాధ్యులైన దోషులను చట్టపరంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ‘‘తిరుమల లడ్డు ప్రసాదం’’లో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడినట్లు ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధుల బృందం సోమవారం తిరుపతిలో కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశం నిర్వహించింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అన్న భాండాగారంగా, ఆధ్యాత్మిక భాండాగారంగా సనాతన ధర్మానికి నిలయంగా ఉందన్నారు. హిందువులు పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంపై వివాదం చెలరేగడం విచారకరం అన్నారు. ఆలయ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం, ఆలయ నిర్వాహణ బాధ్యతలలో అన్య మతస్థులను నియమించడం తదితర కారణాల మూలంగా ఆలయ పవిత్రతకు విఘాతం కలుగుతోందని వీహెచ్‌పీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలోని హిందూ ప్రార్థనా స్థలాలపై ప్రభుత్వ నియంత్రణ రాజ్యాంగ నిబంధనలను మరియు వివిధ కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా కొనసాగుతోందని..తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలయ వ్యవహారాల్లో జోక్యం విరమించుకుని హిందువుల మత స్వేచ్ఛను గౌరవించాలని వీహెచ్‌పీ కేంద్రీయ మార్గదర్శక మండలి సభ్యులు కోరారు. దేవాలయాల నిర్వాహణ బాధ్యతలను ధార్మిక పరిషత్ బోర్డులకు అప్పగించాలని ఈ సందర్భంగా వీహెచ్‌పీ కేంద్రీయ మార్గదర్శక మండలి తీర్మానించింది. ఈ బోర్డులు ఆలయ నిర్వాహణ బాధ్యతలను ప్రజాస్వామ్య, సమ్మిళిత విధానాన్ని అనుసరించే విధంగా ఉండాలని తెలిపారు. ఈ బోర్డులో ప్రధానంగా సాధువులు, హిందూ సంస్థలు, పండితులతో పాటు భక్తులు సభ్యులుగా ఉండాలన్నారు. హిందువులు వారి స్వంత మతపరమైన సంస్థలను నిర్వహించే దిశగా ప్రభుత్వాలు తీసుకునే చర్యలు వివిధ వర్గాల మధ్య సామరస్యంతో పాటు విశ్వసాన్ని మరియు గౌరవాన్ని పెంపొందించగలవని విశ్వ హిందూ పరిషత్ స్పష్టం చేసింది. హిందూ దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు, వాటి స్వయంప్రతిపత్తిని నిర్థారించే విషయంలో వీహెచ్‌పీ రాజీ పడదని పునరుద్ఘటించింది. ఈ కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశంలో పూజ్య శ్రీ విరజానంద స్వామి, పూజ్య శ్రీ సంగ్రామ మహారాజు, పూజ్య శ్రీ బెనారస్ బాబూ గురూజీ, పూజ్య శ్రీ కమలానంద భారతి స్వామీజీ, పూజ్యశ్రీ స్వస్వరూపానంద గిరి స్వామీజీ, శ్రీ బజరంగ్ బాగ్డ గారు, శ్రీ గుమ్మళ్ళ సత్యం గారు పాల్గొన్నారు.