News

జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం

28views

ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వారు నిర్వహించిన పోస్టర్ ప్రజెంటేషన్ కాంపిటీషన్ లో బాపట్ల జిల్లా విద్యార్థినికి జాతీయస్థాయిలో ప్రథమ స్థానం లభించింది. కాగా జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిపిన విద్యార్థి భవ్యశ్రీ జిల్లాలోని కొండమంజులూరు హై స్కూల్ లో 10వ తరగతి చదువుతుంది. విద్యార్థిని పంచుమర్తి భవ్యశ్రీ రూపొందించిన పోస్టర్ ప్రథమ స్థానంలో నిలిచినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా విద్యార్థినీ భవ్యశ్రీకి సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో రూ.పదివేల నగదు పారితోషకాన్ని చెక్కు రూపంలో కలెక్టర్ వెంకట మురళి అందజేశారు. విద్యార్థినికి జ్ఞాపికతోపాటు ప్రోత్సాహక బహుమతులను ఆయన అందజేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

ఈసందర్భంగా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ భూమి చెట్లతో నిండి ఉంటే పర్యావరణం సుభిక్షంగా ఉంటుందనే తాత్పర్యంతో విద్యార్థిని పోస్టర్ ను చక్కగా ఆవిష్కరించిందన్నారు. విద్యార్థినీని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా భవ్యశ్రీ ని కలెక్టర్ కుశల ప్రశ్నలు వేసి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు. జిల్లా కీర్తిని జాతీయస్థాయిలో ఇనుమడింప చేసినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందించారు.