News

మహాకాళేశ్వరునికి రక్షాబంధనం… అలరిస్తున్న వీడియో

25views

దేశవ్యాప్తంగా రక్షా బంధన్‌ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాల్లోనూ భక్తుల సందడి నెలకొంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గల మహాకాళేశ్వరుని ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారంతో శ్రావణమాసం ముగిసింది. ఆఖరి శ్రావణ సోమవారం కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో అచలేశ్వర మహాదేవుడి మందిరంలో పెద్దసంఖ్యలో భక్తులు దర్శనాలు చేసుకున్నారు. స్థానిక సంప్రదాయం ప్రకారం శ్రావణమాసపు ఐదవదీ, ఆఖరిదీ అయిన సోమవారం కావడంతో శివుడికి విశేష పూజలు చేసారు. మారేడు దళాలు, పూలదండలతో అలంకరించారు.క్షీరాభిషేకాలు చేసారు.

ఇవాళ రక్షాబంధన పర్వదినం కూడా కావడంతో సోదరీసోదరులు తమ బంధం బలంగా ఉండాలని శివభగవానుడికి పూజలు చేసారు. చాలామంది పరమశివుడికి రక్షాబంధనం సమర్పించారు.

ఉజ్జయినిలోని మహాకాళేశ్వరాలయం ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడిపోయింది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఉజ్జయినికి ధార్మికంగా అమిత ప్రాధాన్యత ఉంది. శ్రావణమాసంలో మహాకాళేశ్వరుడిని అర్చించుకోడానికి దేశం నలుమూలల నుంచీ భక్తులు పెద్దసంఖ్యలో ఉజ్జయిని చేరుకున్నారు. నర్మదానదిలో పవిత్ర స్నానాలు ఆచరించి శివయ్యను దర్శించుకున్నారు.


సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు మహాకాళేశ్వరునికి భస్మ హారతి అందించడంతోపాటు అందంగా అలంకరించిన రాఖీని కట్టారు. 1.25 లక్షల లడ్డూల మహాభోగాన్ని సమర్పించారు. ఈ లడ్డూలను భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ పురోహితులు పండిట్‌ ఆశిష్‌ పూజారి, పండిట్‌ వికాస్‌ పూజారి భస్మ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.