ArticlesNews

వేదం.. ఆధ్యాత్మిక నాదం

7views

వేద పండితులు, ఘనపాటీల పాద స్పర్శతో ఏలూరు జిల్లా గణపవరం మండలం సరిపల్లె గ్రామం పులకించింది. పండితుల వేద మంత్రాలు, వేద విద్యార్ధుల అర్థ తాత్పర్యాలతో మార్మోగింది. సరిపల్లెలోని సఖ్యాభివర్ధక నిలయంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 104వ వేద శాస్త్ర పరిషత్‌ మహాసభలు వైభవంగా జరిగాయి. 1919లో స్వర్గీయ ఈమని వెంకటేశ్వర్లు స్థాపించిన సఖ్యాభివర్ధక నిలయంలో 104 సంవత్సరాలుగా విరామం లేకుండా ఏటా ఈ వేదసభలు నిర్వహిస్తున్నారు. నిర్వహణకు గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం, గణపవరానికి చెందిన ఆధ్యాత్మిక వేత్త కూసంపూడి సుబ్బరాజు ఆర్థిక సహకారంతో ఈ మహాసభలు నిర్వహిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి వేద విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఏటా శ్రావణ పౌర్ణమి రోజున వేద పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి ఉత్తీర్ణతా పత్రాలు, పట్టాలు పంపిణీ చేస్తారు. ఈ పట్టాలకు దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలలో మంచి గుర్తింపు ఉండటంతో ఏటా వందలాది విద్యార్థులు ఇక్కడ నిర్వహించే వేద పరీక్షలకు హాజరవుతారు.

ఈ ఏడాది ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, బిహార్‌, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాలకు చెందిన 106 మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరికి మూడు రోజులపాటు సరిపల్లె గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం భోజన, వసతి సదుపాయాలు కల్పించింది. శని, ఆదివారాలలో ఘనపాటీలు, వేద పండితులు నాలుగు వేదాల్లో పరీక్షలు నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతులు కూడా ఇక్కడి వేదపాఠశాల విద్యార్థులు కావడం విశేషం. గణపవరం వేద పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన అనేక మంది దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన ఆలయాలలో ఆగమ శాస్త్ర పండితులుగా ఉన్నారు. ఆదివారం సుమారు 60 మంది విద్యార్థులకు వివిధ ప్రశ్నలు సంధించి వేద నైపుణ్యాన్ని పరీక్షించారు.

నాలుగు దశాబ్దాలుగా వస్తున్నా
నేను ఇక్కడ నిర్వహించే వేద పరీక్షలకు 38 సంవత్సరాలుగా పరీక్షాధికారిగా వస్తున్నా. నా కన్నా ముందు మా తండ్రి ఆంజనేయ ఘనపాటీ, పెద తండ్రి వెంకటనారాయణ ఘనపాటీలు పరీక్షాధికారులుగా వ్యవహరించారు. 21 మందిని పరీక్షించగా 19 మంది ఉత్తీర్ణులయ్యారు. – గుళ్లపల్లి విశ్వనాథ ఘనపాటీ, శ్రీకృష్ణ యుజుర్వేద పరీక్షాధికారి

వేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు
నేను 13 ఏళ్లుగా పరీక్షాధికారిగా వస్తున్నాను. ఇక్కడ నిర్వహించే వేద పరీక్షలకు దేశంలో మంచి గుర్తింపు ఉంది. అందువల్ల మంచి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది.
– విష్ణుభట్ల శ్రీకృష్ణ ఘనపాటీ, తెనాలి

వేద పరీక్షకు మంచి గుర్తింపు
ఇక్కడి వేదపాఠశాలకు మంచి గుర్తింపు ఉండేదని మా పూర్వీకుల ద్వారా తెలుసుకున్నాను. ఇక్కడ నిర్వహించే వేద పరీక్షలు భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉంటాయన్న నమ్మకంతో పరీక్షకు హాజరయ్యా.– రుష్యబ్‌ శర్మ, ఉజ్జయిని

తొలిసారి వచ్చాను
నేను తిరుపతి వెంకటేశ్వర వైదిక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. ఈ ఏడాది నుంచి ఇక్కడ శుక్ల యజుర్వేద పరీక్షలు తొలిసారిగా ప్రారంభించడంతో నన్ను పరీక్షాధికారిగా పిలిచారు. తొలిసారిగా వేదవిద్యార్థులను పరీక్షించడం మంచి అనుభూతినిచ్చింది.– గోవింద్‌ ప్రసాద్‌ అధికారి, పరీక్షాధికారి

ఉత్తీర్ణత సాధించాను
నేను మైసూర్‌ దత్త పీఠంలో వేద విద్య అభ్యసిస్తున్నాను. జటఘనం విభాగంలో వేద విద్య నేర్చుకుంటున్నాను. క్రమాంతం పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ఆనందంగా ఉంది.– గుళ్లపల్లి సహృత్‌ నారాయణ శర్మ, కర్నాటక