News

స్వరాజ్య సాధనలో ఆర్.ఎస్.ఎస్.

43views

( ఆగష్టు 15 – భారత స్వాతంత్ర్య దినోత్సవం )

భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని గురించిన చరిత్రను ప్రస్తావించినప్పుడు మధ్య భారత్‌కు చెందిన బిర్సాముండా, ఈశాన్య ప్రాంతానికి చెందిన రాణి గైడిన్లూ, దక్షిణభారతపు అల్లూరి సీతారామరాజు వంటివారి పాత్రను మరచిపోలేము. అలాగే స్వయంసేవకులూ దేశ రక్షణ కోసం ఎంతటి మూల్యాన్నైనా చెల్లించడానికి, ఎంతటి కష్టాన్నైనా భరించడానికి ఎవరితోనైనా మిత్రత్వం వహించడానికీ లేదా శతృత్వం పూనడానికి సైతం వెనుకాడలేదు. తల్లికి సేవ చేసినట్లుగానే ఎలాంటి గుర్తింపు, పేరు ప్రతిష్టలు ఆశించకుండా దేశకార్యంలో నిమగ్నమవ్వాలని పరమ పూజ్యులు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్థాపకులు డా.హెడ్గేవార్ సంఘ్ స్వయంసేవకులకు ఉద్బోధించారు.

గాంధీజీ 1921, 1930, 1942లలో మూడు ప్రధాన అహింసా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. సాధారణ ప్రజానీకానికి కూడా అర్థమయ్యే, ఆచరించగలిగిన విధానాన్ని సూచించి, అందరూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనేట్లు చేసిన ఘనత గాంధీజీకి దక్కుతుంది. ఆయన చూపిన వినూత్నమార్గంలో లక్షలాదిమంది స్వాతంత్ర్యం కోసం పోరాడారు. డా.కె.బి.హెడ్గేవార్ ‌గారు ఈ ఉద్యమాలన్నింటిలో కాంగ్రెస్ నాయకుడిగా పాల్గొన్నారు. సంఘ్ స్థాపన తరువాత కూడా ఆయన స్వాతంత్ర్యోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. వారు 1940లో పరమపదించారు. ఆ తరువాత 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా వందలాదిమంది స్వయంసేవకులు పాల్గొన్నారు. అయితే వారంతా డా.హెడ్గేవార్ సూచించిన విధంగా స్వయంసేవకులుగా కాకుండా సాధారణ ప్రజానీకంలా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు.

స్వాతంత్ర్య పోరాటంలో వందలాదిమంది దేశభక్తులు సాగించిన సాయుధ పోరాటం కూడా ముఖ్యమైనదే. 1857 నాటి స్వాతంత్ర్య సంగ్రామంతో మొదలై చాపేకర్ సోదరులు, బిర్సాముండా, రాణి గైడిన్లు, అల్లూరి సీతారామరాజు, సావర్కర్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, మదన్‌లాల్ ధింగ్రా, రాస్‌బిహారీ బోస్, సుభాష్ చంద్రబోస్ మొదలైనవారంతా ఈ పోరాటం సాగించారు. కానీ, ఆ తరువాత అహింసా ఉద్యమం వల్లనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, ఆ ఘనత ఒక పార్టీకే దక్కుతుందన్న ప్రచారం సాగింది. ఇది చరిత్రను కుదించడం, సంకుచితం చేయడమే అవుతుంది.

డాక్టర్ హెడ్గేవార్ 1921 సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు మొదటిసారి జైలుకు వెళ్ళారు. అదే సమయంలో ఖిలాఫత్ ఉద్యమం కూడా ప్రారంభమైంది. ఈ ఉద్యమం పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ గాంధీజీ ప్రారంభించిన సహాయనిరాకరణ ఉద్యమం బలహీనపడకూడదని డాక్టర్ హెడ్గేవార్ భావించారు. అందుకే, ఖిలాఫత్‌వాది అయిన సమీముల్లాఖాన్ వంటివారితో కూడా డాక్టర్ హెడ్గేవార్ కలిసి పని చేశారు. స్వాతంత్ర్య సాధనకు హెడ్గేవార్ గారు ఏ స్థాయిలో ప్రాధాన్యతను ఇచ్చారో తెలియజేయడానికి దీన్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే, 1930లో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం అనే కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. డా.హెడ్గేవార్ మార్గనిర్దేశంలో ఈ ఉద్యమంలో స్వయంసేవకులు చురుకుగా పాల్గొన్నారు. 1930 జూలై 20, 21, ఆగస్టు 2 నాటి కేసరి పత్రికలో స్వయంసేవకుల సత్యాగ్రహ వార్తలు కనిపిస్తాయి. డా.హెడ్గేవార్ అరెస్టు కావడంతో సత్యాగ్రహుల సంఖ్య మరింత పెరిగింది. ఆయన స్ఫూర్తివంతమైన నాయకత్వమే ఇందుకు కారణం. హెడ్గేవార్ తర్వాత సంఘ్‌ను నడిపే బాధ్యతను మాధవ సదాశివ గోళ్వాల్కర్ చేపట్టారు. సంఘ్‌ను శాఖోపశాఖలుగా అభివృద్ధి చేస్తున్న ఆ సమయంలోనే 1942 క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం అయింది. గురూజీ సూచనలను అందుకుని వేలాదిమంది స్వయంసేవకులు ఉద్యమంలోకి దూకి సాధారణ పౌరులుగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఈ ఉద్యమంలో 125 మంది సత్యాగ్రహులకు జైలు శిక్ష పడితే వేలాదిమంది స్వయంసేవకులు అరెస్ట్ అయ్యారు. ఈ ఉద్యమంలో సింద్‌లోని సక్కర్ పట్టణానికి చెందిన హేమూ కలానీ ఉదంతం ఎంతో స్ఫూర్తివంతమైనది. హేమూ తన స్నేహితులతో కలిసి రైలు పట్టాలకు ఉండే ఫిష్ ప్లేట్లు తొలిగిస్తుండగా దురదృష్టవశాత్తు పోలీసులకు దొరికిపోయాడు. ఆర్మీ కోర్టు హేమూకి 1943లో ఉరిశిక్ష విధించింది. డా.అన్నాసాహెబ్ దేశ్‌పాండే, రమాకాంత్ కేశవ్ దేశ్‌పాండే, శ్రీవసంతరావ్ ఓక్, నారాయణసింగ్, శ్రీచంద్రకాంత్ భరద్వాజ్ ఇలా ఎందరో జ్యేష్ఠ స్వయంసేవకులు దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.

1942 ఆగస్టు 11న పాట్నాలోని ప్రభుత్వ సచివాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి కొందరు యువకులు ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. అప్పుడు వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అందులో దేవీపాద్ చౌదరి, జగపతి కుమార్ అనే ఇద్దరు యువకులు స్వయంసేవకులు. ఆర్.ఎస్.ఎస్.కు తగిన బలం ఉన్న ప్రదేశాలన్నింటిలో స్వయంసేవకులు ఉత్సాహంగా 1942 ఉద్యమంలో పాల్గొన్నారు. అలాగే ఉద్యమంలో పాల్గొంటున్న ఇతరులకు కూడా శాయశక్తులా సహాయం అందించారు. భారతదేశ చరిత్రలో 1946-47 మధ్యకాలంలో జరిగిన సంఘటనలు రక్తసిక్త అధ్యాయాలు. ముస్లింలీగ్ గూండాలు సాగించిన హింసాకాండలో దారుణంగా తయారైన హిందువులను ఆదుకునేందుకు స్వయంసేవకులు పంజాబ్ సహాయ కమిటీ, హిందూ సహాయతా సమితులను ఏర్పాటు చేశారు. 1947 అక్టోబర్ 5న కోట్లీలోని పట్టాన్ పై దాడి జరిగింది. కోట్లీ ప్రజలు తమ పట్టణాన్ని కాపాడుకునేందుకు 26 పోస్టులు ఏర్పాటు చేసుకుంటే అందులో కేవలం 8 పోస్టులను సైన్యం నిర్వహిస్తే మిగిలిన 18 పోస్టులలో స్వయంసేవకులు పోరాడారు. అలాగే పలంధరీ పై దాడి జరిగినప్పుడు కూడా సైన్యంతో కలిసి స్వయంసేవకులు పోరాడారు. జమ్మూకాశ్మీర్ పరిరక్షణలో ముందున్న స్వయంసేవకులు దాని విలీన ప్రక్రియలో కూడా ఆర్.ఎస్.ఎస్.దే కీలక పాత్ర.

దేశవిభజన దురదృష్టకర పరిస్థితుల్లో పంజాబ్, సింద్ ప్రాంతాల్లో సంఘ కార్యకర్తలు అపూర్వమైన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. వీళ్ళు వేలాదిమంది మహిళల, పిల్లల మానప్రాణాలను కాపాడారు. ఈ కార్యంలో అనేకమంది యువకులు తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. ముస్లిం లీగ్ గూండాలను ఎదిరించడంలో, హిందూ, సిక్కు కుటుంబాలను సురక్షితంగా భారత్‌కు చేర్చడంలో స్వయంసేవకులు ప్రధాన పాత్ర పోషించారంటే అతిశయోక్తి కాదు. ఆనాడు ఆర్.ఎస్.ఎస్. నిలబడకపోతే దేశ విభజన అగ్నిలో ఇంకా ఎన్నివేలమంది ఆహుతి అయ్యేవారో. దేశమంతా స్వాతంత్ర్యోత్సవ సంబరాల్లో మునిగిపోతే ఆర్.ఎస్.ఎస్. మాత్రం కొత్తగా వచ్చిన ఆ స్వాతంత్ర్యాన్ని కాపాడే పనిలో నిమగ్నమైంది. భారతదేశ ప్రధాన నాయకులను హత్య చేసేందుకు ముస్లింలీగ్ 1947 సెప్టెంబర్‌లో భారీ పేలుళ్లకు పథకం వేసింది. కానీ స్వయంసేవకులు ఇచ్చిన సమాచారంతోనే భద్రతాదళాలు తిరుగుబాటుదారుల్ని అరెస్టు చేశాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దురదృష్టవశాత్తు కాంగ్రెస్ నేతలు పోర్చుగీసు కాలనీలైన గోవా, డామన్, డయూ, దాద్రా, నగర్ హవేలీ, ఫ్రెంచి కాలనీ పాండిచ్చేరిల సంగతి మర్చిపోయారు. కానీ ఆర్.ఎస్.ఎస్. అలా మర్చిపోలేదు. స్వయంసేవకులు గోవాతో పాటు పోర్చుగీసు కాలనీల విముక్తి కోసం పోరాటంలో పాల్గొన్నారు. లక్షలాదిమంది ప్రజానీకాన్ని రక్షించవలసిన అగత్యం ఏర్పడినప్పుడు సైన్యం తరువాత అతిపెద్ద వ్యవస్థీకృత శక్తిగా అవతరించిన ఆర్.ఎస్.ఎస్. తనకు చేతనైనంత మేరకు ఆ పని చేసింది. దేశబంధువులను రక్షించడం కోసం అవసరమైనప్పుడు స్వయంసేవకులు ఆయుధాలు కూడా చేపట్టారు. అందుకు వారిపై కొందరు మతతత్వవాదులు అని ముద్ర కూడా వేశారు. నిజానికి స్వయంసేవకులు చేసిన కార్యం మతత్వమా లేక దేశభక్తితో కూడిన సాహసమా అన్నది ప్రజలే నిర్ణయించాలి.