News

బంగ్లాదేశ్ చొరబాటుదార్లను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు నియమించండి: జార్ఖండ్ హైకోర్టు

58views

జార్ఖండ్ లో బంగ్లాదేశీయుల అక్రమ చొరబాట్ల అంశం ఇప్పుడు పెద్ద అంశమై కూర్చుంది. దీంతో అక్కడి వారి వనవాసీల జనాభా తీవ్రంగా తగ్గిపోతోంది. ఈ విషయంపై ఇప్పటికే అనేక హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిపై జార్ఖండ్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అసలు అక్రమ చొరబాటుదార్లు ఎందరున్నారో లెక్కించాలని, ఈ విషయంలో ప్రభుత్వ ప్రణాళిక ఏమిటో సవివరంగా తెలియజేయాంటూ ఆదేశించింది. దుమ్కా, పాకుర్, జమ్తారా, డియోఘర్ సాహెబ్ గంజ్, గొడ్డా జిల్లాల్లో అసలు ఎంత మంది అక్రమంగా బంగ్లాదేశీయులు నివాసముంటున్నారో నివేదిక సమర్పించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను జస్టిస్ సుజిత్ నారాయణ్ ప్రసాద్, జస్టిస్ అరుణ్ కుమార్ రాయ్ తో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

మరోవైపు చొరబాటుదార్లను గుర్తించేందుకు పోలీసులకు ఇబ్బందులు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వాదించింది. అయితే.. ఇలా అక్రమ చొరబాటుదార్లను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని, అసలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదంటూ హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ ప్రాంతాలలో నకిలీ రేషన్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు తయారవుతున్నాయని హైకోర్టు నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. ఇందుకోసం తప్పుడు పత్రాలను సృష్టిస్తున్నారని మండిపడింది. అంతేకాకుండా స్థానికంగా వుండే వారి హక్కులను కూడా కాలరాస్తున్నారని, అక్రమ చొరబాటుదార్లను గుర్తించేందుకు వెంటనే ప్రత్యేక బృందం నియమించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రేషన్ కార్డు, ఓటరు కార్డు, ఆధార్ కార్డు లాంటివి జారీ చేయాలని హైకోర్టు సంబంధిత జిల్లాల అధికారులకు సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 22 కి కోర్టు వాయిదా వేసింది.