News

కాన్పూర్‌లో హిజాబ్ వివాదం: ప్రభుత్వ కళాశాలలో డ్రెస్‌కోడ్ ఉల్లంఘనపై విచారణకు కలెక్టర్ ఆదేశం

44views

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని బిల్హౌర్ ప్రాంతంలో ఓ ప్రభుత్వ కళాశాలకు ముగ్గురు విద్యార్ధినులు హిజాబ్‌లు ధరించి వచ్చిన సంఘటనపై జిల్లా కలెక్టర్ రాకేష్ సింగ్ దర్యాప్తుకు ఆదేశించారు. కళాశాలకు డ్రెస్ కోడ్ ఉండగా దానికి విద్యార్ధినులు కట్టుబడి ఉండకపోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఘటనపై పూర్తిగా విచారించి ఆగస్టు 17లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని సబ్ కలెక్టర్ రష్మీ లాంబాను కలెక్టర్ ఆదేశించారు.

దర్యాప్తు ప్రధానంగా మూడు అంశాలపై జరుగుతుంది. విద్యార్ధినులు ఆ సంఘటనకు ముందే ఆ కళాశాలలో ఎన్‌రోల్ అయి ఉన్నారా? వారు హిజాబ్‌లు స్వచ్ఛందంగా ధరించి ఉంటే, వారికి కళాశాల డ్రెస్‌కోడ్ విధానం గురించి తెలుసా? కళాశాల నియమ నిబంధనలను ఉల్లంఘించి హిజాబ్‌లు ధరించేలా వారిపై బైటి ప్రభావం ఏమైనా ఉందా?

కాన్పూర్‌లోని ప్రభుత్వ ఇంటర్ కళాశాలకు నిర్దిష్టమైన డ్రెస్‌కోడ్‌ ఉంది. ఆగస్టు 3న ముగ్గురు ముస్లిం విద్యార్ధినులు కళాశాలకు డ్రెస్‌కోడ్‌కు భిన్నంగా హిజాబ్‌లు ధరించి వచ్చారు. దాన్ని గమనించిన ఒక మహిళా లెక్చరర్ వారిని మందలించారు, కళాశాల డ్రెస్‌కోడ్ విధానానికి కట్టుబడి ఉండమని సూచించారు. అయినప్పటికీ ఆ విద్యార్ధినులు ఆ మందలింపులను పట్టించుకోకుండా హిజాబ్‌లు ధరించి రావడం కొనసాగించారు. తమను కళాశాల నుంచి తొలగించినా సరే హిజాబ్‌ ధరించే ఉంటామని స్పష్టం చేసారు.

ఆ విషయం క్రమంగా ప్రిన్సిపాల్ సుర్జీత్‌సింగ్ యాదవ్‌కు తెలిసింది. ఆయన వారిని పిలిపించి, కళాశాల నియమాలను అతిక్రమించకూడదని హెచ్చరించారు. తమపై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా పర్వాలేదు, తాము హిజాబ్‌ ధరించే కళాశాలకు వస్తామంటూ ఆ విద్యార్ధినులు రాతపూర్వకంగా వెల్లడించారు. దానికి స్పందనగా, కళాశాలలోకి విద్యార్ధులు నిర్దేశిత యూనిఫాం కాకుండా వేరే దుస్తులు ధరిస్తే వారు కళాశాలలోకి రాకుండా ప్రిన్సిపాల్ నిషేధం విధించారు.

ఆ అంశాన్ని పరిష్కరించడానికి, ప్రిన్సిపాల్ యాదవ్ విద్యార్ధినుల తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. వారు తమ పిల్లలు ఇకపై కళాశాలకు సరైన యూనిఫాంలో వస్తారని హామీ ఇచ్చారు.

అసలు ఈ ఘటన వెనుక ఏం కారణాలున్నాయో తెలుసుకోడానికి కాన్పూర్ జిల్లా కలెక్టర్ దర్యాప్తుకు ఆదేశించారు. బైటివారెవరైనా విద్యార్ధినులను ప్రభావితం చేస్తున్నారేమో తెలుసుకోడానికి, ఈ ఘటనపై ఏ చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకోడానికీ దర్యాప్తు ఉపయోగపడుతుంది.