News

సై సై రా చిన్నపరెడ్డి..నీ పేరే బంగరు కడ్డీ

46views

( ఆగష్టు 13 – గాదె చిన్నప రెడ్డి వర్ధంతి )

భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. ప్రాణత్యాగం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎంతో మంది నాయకులకు రావలసిన గుర్తింపు రాలేదు. అయినా వారు దేశం కోసం నిస్వార్థ త్యాగాలు చేశారు. గాదె చిన్నపరెడ్డి. వందేమాతరం అంటూ ఎందరో యువతీయువకులను ముందుకు నడిపించి..పల్లెపల్లెను తట్టిలేపి..గుండెగుండెల్లో ఫిరంగులు మోగించి…ఆత్మస్థైర్యమే ఆయుధంగా పిడికిలెత్తి నినదించిన కదన కేసరి ఆయనే గాదె చిన్నపరెడ్డి. పల్నాడు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం మోతుబరి రైతు కుటుంబానికి చెందిన గాదె సుబ్బారెడ్డి, లింగమ్మ దంపతులకు ఆరవ సంతానంగా 1864లో చిన్నపరెడ్డి జన్మించారు. చిన్నపరెడ్డికి చదువు పెద్దగా అబ్బలేదు కానీ కత్తిసాము, కర్రసాము, గుర్రపు స్వారీ వంటి అస్త్ర విద్యల్లో ఆరితేరాడు. రామాయణ, మహాభారతం కథల్ని సమూలంగా ఔపోసన పట్టాడు. బాల్యం నుండే నాయకత్వ లక్షణాలతో పాటు దానగుణాన్ని కలిగిన చిన్నపరెడ్డి, తన దేశ ప్రజల దుస్థితిని ఎదిగి ఎదగని వయసులోనే గుర్తించాడు. తన ఇంట్లో పండించిన పంటను పేదలకు పంచడాన్ని చిన్నతనంలోనే అలవర్చుకున్న చిన్నపరెడ్డి యుక్త వయస్సుకు రాగానే అక్రమార్కులను కొల్లగొట్టి పేదలకు పంచడం ప్రారంభించాడు.

చేబ్రోలు, నాదెండ్ల ప్రాంతాల్లో కొందరు గ్రామ పెత్తందార్లు..తెల్లదొరల అడుగులకు మడుగులు ఒత్తుతూ ప్రజలను కట్టు బానిసలుగా మలుచుకుని నిర్దాక్షిణ్యంగా పీడించేవాళ్ళు. తెల్లదొరల మెప్పుకోసం ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవాళ్ళు. ఈ పరిస్థితిని పూర్తిగా వ్యతిరేకిస్తూ నిరంకుశత్వంపై చిన్నపరెడ్డి కన్నెర్రజేశాడు. పెత్తందార్లకు సవాలుగా నిలిస్తూ, వారి ఆగడాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. 1907లో నీలిమందు పంట విక్రయానికి మద్రాసు వెళ్ళినప్పుడు అక్కడ కూవం నది ఒడ్డున జరుగుతున్న బహిరంగ సభలో ప్రకాశం పంతులు, బాలగంగాధర తిలక్ ప్రసంగాలను చిన్నపరెడ్డి విన్నాడు. వారి నోటి వెంట వెలువడ్డ ‘వందేమాతరం’ నినాదం వినగానే ఆయనలో నూతనోత్తేజం పెల్లుబికింది. చేబ్రోలు తిరిగివచ్చాక ‘వందేమాతరం మనదే రాజ్యం’ నినాదాన్ని సృష్టించుకుని పెద్ద ఎత్తున దండు తయారు చేసుకొని స్వాతంత్ర్య కాంక్షను తెలియజేస్తూ వివిధ సభలు, సమావేశాలు నిర్వహించడం మొదలు పెట్టాడు. అప్పటికే చిన్నపరెడ్డిపై ఓ కన్నేసిన బ్రిటిష్ అధికారులు అవకాశం కోసం ఎదురు చూడసాగారు.

అది 1909వ సంవత్సరం ఫిబ్రవరి 18 శివరాత్రి పర్వదినం. కోటప్పకొండ వద్ద మహాశివరాత్రి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆనవాయితీగా తన ఎడ్ల బండ్లల్లో ప్రభలను అలంకరించుకుని కోటప్పకొండకు చేరిన చిన్నపరెడ్డి జాతరలో వందేమాతరం మనదే రాజ్యం అంటూ సింహనాదం చేశాడు. ఇక అవకాశం కోసం ఎదురుచూస్తున్న బ్రిటిష్ అధికారులు తమ వద్ద పని చేస్తున్న సయ్యద్ హుస్సేన్ అనే పోలీసును ప్రేరేపించి అల్లర్లు సృష్టించి..వాటిని అదుపు చేసే నెపంలో కాల్పులు జరిపించారు. ఈ ఘటనలో చిన్నపరెడ్డి ఎద్దు ఒకటి మరణించింది. కోపోద్రిక్తుడైన చిన్నపరెడ్డి పోలీసులకు ఎదురుతిరగడంతో అతడిని అరెస్టు చేశారు. అది చూసిన జనాలు పోలీసులపై తిరగబడ్డారు. వందేమాతరం మనదే రాజ్యం అని నినదిస్తూ ముందుకురికారు. చిన్నపరెడ్డిని విడిపించుకుని, ఠాణాకు నిప్పు పెట్టారు. ఇద్దరు కానిస్టేబుళ్లను మంటల్లోకి విసిరేశారు. మిగిలిన వారిని తరిమికొట్టారు. దాంతో పోలీసులు చిన్నపరెడ్డితో పాటు దాదాపు 100 మందిపై కేసులు పెట్టారు.

మద్రాసు ప్రావిన్సులో సంచలనం సృష్టించిన ఈ కేసుపై గుంటూరు అదనపు సెషన్ న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదోపవాదాల తర్వాత ఐషర్ కార్షన్ అనే న్యాయాధిపతి 21 మందికి ఉరిశిక్ష, 24 మందికి కఠిన కారాగార శిక్షలు విధించాడు. దీనిపై చిన్నపరెడ్డి మద్రాసు హైకోర్టుకు వెళ్లాడు. సంఘటనకు పూర్తి బాధ్యత తానే వహిస్తున్నానని, కావాలంటే తనను ఉరి తీసి, మిగిలిన వారిని వదిలి వేయాలని కోర్టుకు విన్నవించగా, 1910 ఆగస్టు 13న చిన్నపరెడ్డికి మరణశిక్ష 21 మందికి ద్వీపాంతర శిక్ష విధించింది. ప్రజలు ఆందోళనలకు దిగకుండా చిన్నపరెడ్డిని రాజమహేంద్రవరం జైలులో వెంటనే ఉరి తీశారు.

చిన్నపరెడ్డి ఉరితీత ఘటనతో నాటి ఆంధ్రుల్లో స్వాభిమానంతో పాటు దేశభక్తి, స్వాతంత్ర్య కాంక్ష మరింత పెరిగి, నాటి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడేలా చేసింది. అల్లూరి సీతారామ రాజు, కన్నెగంటి హనుమంతులాంటి వారు స్వరాజ్య సమరాల్లో అగ్రశ్రేణిలో నిలిచి పోరాడారు. చిన్నపరెడ్డి పోరాట గాథను అప్పట్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న బుర్రకథ కళారూపంలో పాడుకునేవారు. త్యాగం, ధర్మం తన పతాకగా చేసుకుని ప్రజా సైన్యాన్ని నడిపించిన చిన్నపరెడ్డి వీరగాథ చరిత్రలో పెద్దగా కనపడకపోయినా జానపదుల గాథల్లో నేటికీ మార్మోగుతూనే ఉంది. సైరా చిన్నపరెడ్డి నీ పేరే బంగరు కడ్డీ అనే జానపద గీతం ఇప్పటికీ ఉమ్మడి గుంటూరు ప్రజల నాలుకల మీద కదులుతూనే ఉంది.