News

ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాక్‌: కశ్మీర్‌ ఎల్‌జీ

69views

జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్‌ శిక్షణ పొందిన ఉగ్రవాదులను భారత్‌లోకి ఎగదోస్తోందని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) మనోజ్‌ సిన్హా తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఉగ్ర ఘటనలు కలవరపెడుతున్నాయి. తాజాగా అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ ఎల్‌జీ మనోజ్‌ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశపు దుర్మార్గపు కుట్రలను విఫలం చేసేందుకు భద్రతా బలగాలు, పాలనా యంత్రాంగం ఒక వ్యూహాన్ని రూపొందించాయన్నారు. వచ్చే మూడు నెలల్లో స్థానిక పరిస్థితిలో పెను మార్పు కనిపిస్తుందని ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ‘‘ఇటీవలి ఉగ్ర ఘటనలు బాధాకరం. వాటిని కచ్చితంగా నియంత్రిస్తాం. పొరుగు దేశం దుష్ట పన్నాగాలు విఫలమవుతాయి. ఆ దేశం ఉగ్రవాదానికి నిలయం. ఇక్కడి శాంతిభద్రతలను అస్థిరపర్చేందుకు వారిని ప్రోత్సహిస్తోంది. ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్‌ పెద్దఎత్తున బలగాలను రంగంలోకి దించుతోంది. సైన్యం, సీఆర్పీఎఫ్, పోలీసు సిబ్బంది మోహరింపును ముమ్మరం చేశాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ వ్యూహాన్ని సమీక్షించారు. రాబోయే రోజుల్లో సత్ఫలితాలు కనిపిస్తాయి’’ అని మనోజ్‌ సిన్హా తెలిపారు.