News

‘అరుణాచలం ఆలయంపై కోర్టు తీర్పును డిఎంకె ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది’

63views

తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం రాజగోపురం ముందు దుకాణాలు నిర్మిస్తుండడంపై తమిళనాడులోని దేవాలయాల పరిరక్షణ కార్యకర్త, ఇండిక్ కలెక్టివ్ ట్రస్ట్ అధ్యక్షుడు టిఆర్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని తమిళనాడు దేవదాయశాఖ ఇచ్చిన హామీని ఉల్లంఘించి ఆ నిర్మాణాలు చేస్తున్నారని మండిపడ్డారు.

‘‘తమిళనాడు దేవదాయశాఖలోని మూర్ఖులు అరుణాచలేశ్వరాలయం తూర్పు రాజగోపురం ముందు 150 దుకాణాలు నిర్మిస్తున్నారు. అది ఆలయానికి చెందిన స్థలం. అక్కడ వివిధ ఉత్సవాల సందర్భాల్లో వేలాది భక్తులు చేరతారు. అక్కడ దుకాణాలు నిర్మించడానికి గతంలోనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అప్పుడే ఆ విషయాన్ని నేను మద్రాస్ హైకోర్టులో దేవాలయాల వ్యవహారాలు చూసే బెంచ్ దృష్టికి తీసుకెళ్ళాను. ఆ విషయాన్ని కోర్టు అప్పుడే వెంటనే విచారించింది. రాజగోపురం ముందు నిర్మాణపనులు నిలిపేయాలంటూ న్యాయమూర్తులు అప్పుడే ఆదేశించారు’’ అని రమేష్ చెప్పారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తాజాగా డిఎంకె ప్రభుత్వ ఉల్లంఘనల గురించి ట్వీట్ చేసిన రమేష్ ఇంకా ఇలా చెప్పుకొచ్చారు ‘‘నేను దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై కోర్టు ఆదేశాలకు స్పందనగా తమిళనాడు దేవదాయ శాఖ అక్కడ నిర్మాణాలు జరగబోవని హామీ ఇచ్చింది. ఆ శాఖ కమిషనర్ ఆ మేరకు స్పష్టంగా కోర్టుకు అండర్‌టేకింగ్ దాఖలు చేసారు. ఆ విషయాన్ని డివిజన్ బెంచ్ తన ఉత్తర్వుల్లో నమోదు చేసింది.’’

అయితే ఇప్పుడు ఆ ప్రదేశంలో నిర్మాణ పనులు చురుగ్గా సాగిపోతున్నాయి. ఆ విషయాన్ని రమేష్ గ్రహించారు. దాంతో దేవదాయశాఖ నిబద్ధతపై అనుమానాలు తలెత్తాయని రమేష్ చెబుతున్నారు.

‘‘ఇప్పుడు గుడి రాజగోపురం ముందు చాలా పని జరుగుతోంది. ఆలయ ఉత్సవాలు, ఆచార సంప్రదాయాల నిర్వహణ అవసరాల కోసం ఆ స్థలం ఖాళీగా ఉండాలి. అక్కడ వందలాది తాత్కాలిక దుకాణాలు వస్తున్నాయి. ఈ తాత్కాలిక దుకాణాలు ఒకసారి నిర్మిస్తే ఏళ్ళతరబడి ఉండిపోతాయి. గుడిముందు ఖాళీగా ఉండాల్సిన ప్రదేశంలో ఈ దుకాణాలు మొలుచుకువస్తున్నాయి.’’

రమేష్ ఆందోళన దుకాణాల నిర్మాణానికే పరిమితం కాలేదు. ఆయన తన ట్వీట్‌లో రెండు కీలకాంశాలను ప్రస్తావించారు.

‘‘దీనర్ధం ఏమై ఉంటుందంటే, రెండు విషయాలు అర్ధమవుతాయి…

1. మద్రాస్ హైకోర్ట్ ముందు కమిషనర్ నిఖార్సుగా అబద్ధమాడి ఉండాలి

2. ఇక్కడ దుకాణాలకు అనుమతి ఇవ్వడంలో బోలెడంత అవినీతి జరిగుండాలి.

నేను దీన్ని చూస్తూ ఊరుకోను. 1951 డిసెంబర్ 13 నుంచి మోసపూరితంగా ఈ గుడిలో సిగ్గులేకుండా తిష్ఠ వేసిన తమిళనాడు దేవదాయ శాఖను పూర్తిగా తొలగించాలంటూ నేను హైకోర్టులో పిటిషన్ వేస్తాను’’ అని రమేష్ ఎక్స్‌లో వివరించారు.