News

రత్నగిరిపై ఆధ్యాత్మిక సౌరభం

51views

ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సత్యదేవుని 134వ ఆవిర్భావ దినోత్సవం (జయంత్యుత్సవం) సందర్భంగా రత్నగిరిపై మంగళవారం ఆధ్యాత్మిక సౌరభం వెల్లి విరిసింది. వివిధ వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ప్రత్యేక శోభను సంతరించుకుంది. సత్యదేవుని జన్మ నక్షత్రం ‘మఖ’ కూడా మంగళవారం రావడంతో సత్యదేవునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు స్వామివారి ఆయుష్య హోమం, పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది వేడుకల్లో ప్రధానంగా స్వామివారి దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి దాత, శ్రీలలితా రైస్‌ ఇండస్ట్రీ అధినేతల్లో ఒకరైన మట్టే సత్యప్రసాద్‌, కమల దంపతులు రూ.1.5 కోట్ల వ్యయంతో తయారు చేయించిన వజ్ర కిరీటం, స్వామి, అమ్మవార్లకు వజ్ర కర్ణా భరణాలు అలంకరించడంతో ప్రత్యేక శోభతో స్వామి, అమ్మవారు ప్రకాశించారు.

ఘనంగా జన్మ నక్షత్ర పూజలు, అభిషేకం
రత్నగిరివాసుడు సత్యదేవుని 134వ ఆవిర్భావ దినోత్సవం శ్రావణశుద్ధ విదియ సందర్భంగా మంగళవారం రత్నగిరిపై ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు సత్యదేవుని ఆలయం తెరచి పూజలు నిర్వహించారు.మూడు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ ప్రధానాలయంలోని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరుని మూలవిరాట్‌లకు పంచామృతాలతో పండితులు అభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం స్వామి, అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో, స్వామి, అమ్మవార్లను వజ్ర కిరీటాలు, వజ్ర కర్ణాభరణాలతో, సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి పూజించారు. అనంతరం ఉదయం 7–30 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, స్వామి, అమ్మవార్లకు వజ్ర కిరీటాలు, వజ్ర కర్ణాభరణాలు చేయించిన దాత మట్టే సత్యప్రసాద్‌ దంపతులు, బంధుమిత్రులతో కలిసి అభిషేకంలో పాల్గొన్నారు.