News

విదేశీ విద్యార్థుల రామాయణ ప్రదర్శన

60views

శభాష్‌.. పాత్రధారణ అంటే ఇలా ఉండాలి! అందం, హావభావాలతో వారు సీతారాములును తలపించారు. రాముడు, సీత జననం, వారి బాల్యం, విద్యాభ్యాసం, స్వయంవరం, 14 ఏళ్ల వనవాసం, రావణుడిపై విజయం లాంటి సన్నివేశాలతో విదేశీ విద్యార్థులు అబ్బురపరిచారు. విదేశీ విద్యార్థులు రామాయణ ఘట్టాలను అవగతం చేసుకుని ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. ఆధ్యాంతం అద్భుతంగా నటించి మెప్పించారు. రామాయణంలో దాగి ఉన్న సంస్కృతీసంప్రదాయలను పాట..నృత్య రూపంలో విదేశీ విద్యార్థుల ప్రదర్శన అద్భుతంగా సాగింది. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రచారం చేసేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌, సూరతి సంయుక్తంగా రామాయన్‌ పేరుతో సంగీత సాహిత్య ప్రదర్శనను విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించారు.

ఈ ప్రదర్శనను ఏయూ ఇంటర్నేషనల్‌ డీన్‌ ఈఎన్‌ ధనుంజయరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూలో చదువుతున్న వివిధ దేశాల విద్యార్థులకు రామాయణంలోని ఇతిహాసాలు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపపడిందన్నారు. సూరతి వ్యవస్థాపకురాలు రిమ్లీ మాట్లాడుతూ రామాయణం ఇతిహాస సారాంశాన్ని మరో నూతన కోణంలో ప్రదర్శించడం జరిగిందన్నారు. రామాయణం అద్భుత కథాంశాన్ని అందంగా, వైవిధ్యంగా, సందేశాత్మకంగా మ్యూజికల్‌ థియేటర్‌, ఒపేరా, జాజ్‌ , సమకాలీన సంగీత ప్రక్రియలతో ప్రదర్శించారు. కార్యక్రమంలో ఇండియాన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్‌ రీజినల్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.