ArticlesNews

మహిమాన్విత హనుమద్‌ క్షేత్రాలు

49views

అనంతపురం జిల్లాలోని నేమకల్లు, మురడి, కసాపురంలోని ఆలయాలు మహిమాన్విత హనుమద్‌ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్న ఈ ఆలయాలను శ్రావణ మాసంలో ఒకే రోజు దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న శ్రావణ మాస ఉత్సవాలకు హనుమద్‌ క్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.

భక్తజన వరదాయకుడిగా…
భక్తజన వరదాయకుడిగా నేమకల్లు, మురిడి, కసాపురం గ్రామాల్లో వెలసిన ఆంజనేయస్వామికి ఖ్యాతి ఉంది. 15వ శతాబ్దంలో వ్యాస మహర్షి ఒకే రోజున ఆయా ఆలయాల్లో ఆంజనేయస్వామి మూలవిరాట్‌లను ప్రతిష్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రావణ మాసంలో మంగళ, శనివారాల్లో ఈ మూడు ఆలయాలను దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకం. అందుకే ఈ మూడు ఆలయాలను సందర్శించుకునేందుకు శ్రావణ మాసంలో భక్తులు పొటెత్తుతుంటారు. ఈ క్రమంలో ఈ నెల 6న శ్రావణ మాసం ప్రారంభం కానుండడంతో ఆయా ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఉత్సవాలు, రధోత్సవాల్లో భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా బారికేడ్లు, వసతి గృహాలను సిద్ధం చేశారు. ఈ నెల 6, 13, 20, 27వ తేదీల్లో వచ్చే మంగళవారాలు, 10, 17, 24, 31వ తేదీల్లో వచ్చే శనివారాల్లో విశేష పూజలు, ఆర్జిత సేవలు ఉంటాయని అర్చకులు తెలిపారు. అలాగే దాతల సహకారంతో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు.

ఏర్పాట్లు పూర్తి
నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా శ్రావణ మాస ఉత్సవాలను నిర్వహించేందకు నేమకల్లు, మురిడి ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. వీఐపీ, సర్వ దర్శనంతో పాటు అభిషేకాలు, కుంకుమార్చన తదితర పూజలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. భోజన వసతి, ప్రసాదం, అన్నదానం ఉంటుంది. – నరసింహారెడ్డి, ఈఓ