News

రూ.57.48 లక్షలతో ఒంటిమిట్ట రామాలయం నవీకరణ

38views

వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవీకరణ పనుల నేపథ్యంలో సెప్టెంబరు 8న బాలాలయ ప్రతిష్ఠను నిర్వహిస్తామని టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్‌ భట్టార్‌ పేర్కొన్నారు. రామయ్య క్షేత్రంలో గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం, విమాన గోపురం నవీకరణ, మరమ్మతులు రూ.57.48 లక్షలతో భారతీయ పురాతత్త్వ సర్వేక్షణశాఖ ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని అధికారులు పరిశీలించి సమావేశం నిర్వహించారు. వార్షిక పవిత్రోత్సవాలు సెప్టెంబరు 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అవి పూర్తయిన తర్వాత పనులు ప్రారంభించాలని తితిదే అధికార యంత్రాంగం నుంచి అభ్యర్థనలు రావడంతో పురావస్తుశాఖ అధికారులు అంగీకరించారు. ఆ సమయంలో పాత కల్యాణ మండపంలో భక్తులకు స్వామి దర్శన ఏర్పాట్లు చేయాలని సివిల్, విద్యుత్తు విభాగం సాంకేతిక నిపుణులను ఆదేశించారు. వచ్చే నెల ఆరో తేదీన సాయంత్రం బాలాలయం పూజలకు అంకురార్పణ చేయనున్నట్లు తెలిపారు. పాత కడప బండలను తొలగించి చలువరాయి పరుస్తామని పురావస్తుశాఖ జిల్లా అధికారి పి.బాలకృష్ణారెడ్డి తెలిపారు.