పెరూలో తవ్వకాలు నిర్వహిస్తున్న ఆర్కియాలజిస్టులు 4,000 ఏళ్లనాటి ప్రాచీన ఆలయాన్ని కనుగొన్నారు. ఈ ప్రాంతంలో వేల ఏళ్ల కిందట ఒక ప్రాచీన నాగరికత విలసిల్లిందనడానికి తార్కాణాలుగా ఈ తవ్వకాలలో మానవ అవశేషాలు, కళాఖండాలు బయటపడ్డాయి.
ఉత్తర పెరూలోని ఇసుక దిబ్బల కింద, నాలుగువేల ఏళ్లనాటి ఒక ఆలయంతో పాటుగా కొన్ని మానవ అవశేషాలను కూడా ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. ఇక్కడ బలుల వంటి ఆచారాలు కొనసాగి ఉండవచ్చని, ఆ మానవ అవశేషాలు అటువంటి మతపరమైన ఆచారాలకు సంబంధించినవే అయి ఉండవచ్చని ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు. దక్షిణ అమెరికాలోని లంబాయెక్ ప్రాంతంలో గల జానా ఎడారి జిల్లా ప్రాంతంలో ఇవి బయటపడ్డాయి. ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉండటమే కాదు, దేశరాజధానికి కూడా సమీపంలో ఉంది. ఆ అవశేషాల ఖచ్చితమైన కాలాన్ని ఖరారు చేసేందుకు తాము రేడియో కార్బన్ డేటింగ్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని, ఆ కాలంలో పెరూ ఉత్తర తీర ప్రాంతంలో నిర్మించిన కర్మకాండలకు సంబంధించిన ఆలయాలలో ఇది కూడా ఒక భాగమై ఉండవచ్చని ఆర్కియాలజిస్టులు చెబుతు న్నారు. ఒకనాటి పలు అంతస్తుల భవనంగా భావిస్తున్న ఆ నిర్మాణం గోడల మధ్యలో ముగ్గురు వయోజనుల అవశేషాలను కనుగొన్నారు. ఇందులో ఒకరిని బట్టలో చుట్టి, కొన్ని ప్రసాదాలను కూడా ఉంచారని వారు చెబుతున్నారు.
ఈ ఆలయ గోడలలో ఒకదానిపై మానవ శరీరం. పక్షి తల కలిగిన ఒక శిల్పం ఉందిట. ఇటువంటి డిజైను అన్నది 900 బీసీ నాటి హిస్పానిక్ చవిన్ సంస్కృతికన్నా ఎంతోముందు విలసిల్లిన నాగరికతలో కనిపిస్తుందని, ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. ఉత్తర పెరూలో 5,000 ఏళ్ల నాటి కారల్ పవిత్ర నగరంలో ఇటవంటి కర్మకాండలకు సంబంధించిన భవన సముదాయాలు కనిపిస్తాయి. దక్షిణ పెరులోని ఐకా ప్రాంతంలో 1,500 ఏళ్ల కిందట ఎడారి ప్రాంతంలో మార్మికమైన బీజాక్షరాల వంటివాటిని చెక్కి ఉన్న ఫలకాలు బయటపడడంతో అది ప్రాచుర్యాన్ని పొందింది.
పెరూలో అతి ముఖ్యమైన పురావస్తు ప్రాంతం ‘ఇన్కా’లకు చెందిన ‘మాచుపిచు’ ప్రాంతం. పర్వతప్రాంతమైన కస్కోలోని ఈ ప్రపంచ వారసత్వ కట్టడాన్ని 15వ శతాబ్దం మధ్యలో నిర్మించారు.