News

పెళ్ళయిన నెలలోపే ట్రిపుల్ తలాక్, కేసు పెట్టని పోలీసులు, స్పందించని సీఎంఓ

59views

తమిళనాడులో ఒక ముస్లిం మహిళకు పెళ్ళయిన 28 రోజులకే ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పేసాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తే ట్రిపుల్ తలాక్ చట్టం గురించి తమకు తెలియదంటూ కేసు పెట్టడానికి నిరాకరించారు. ఆమె కుటుంబం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేస్తే, ఏ చర్యా తీసుకోలేమని జవాబు వచ్చింది. ముస్లిం మహిళల దారుణమైన స్థితిగతులకు ఇది తాజా ఉదాహరణ మాత్రమే.

నస్రీన్ ఫాతిమా (31) దిండిగల్ జిల్లా, పళని పట్టణం లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన మహిళ. ఆమెకు తిరుప్పూరు నివాసి అయిన ఖాదర్ రియాజ్‌తో 2022 ఆగస్టులో పెళ్ళయింది. కొద్దిరోజులకే ఆమె అత్తవారి కుటుంబం ఆమెను అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. లక్షల విలువైన బంగారు నగలు తేవాలని డిమాండ్ చేసారు. ఆ గొడవల్లో ఖాదర్ రియాజ్, నస్రీన్‌ను 2022 సెప్టెంబర్‌లో పుట్టింటికి పంపించేసాడు. అప్పుడే ఆమెకు మూడుసార్లు తలాక్ చెప్పాడు. నస్రీన్ తన భార్యగా నెల్లాళ్ళు ఉన్నందుకు మనోవర్తిగా రూ.1500 కూడా ఇచ్చాడు.

నస్రీన్ ఫాతిమా కుటుంబం ఆమె భర్త మీద పళనిలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో వరకట్నం వేధింపుల ఫిర్యాదు చేసారు. పోలీసులు ఏ చర్యలూ తీసుకోలేదు. నిరాశ చెందిన నస్రీన్ కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఫలితంగా ఎట్టకేలకు ఖాదర్ రియాజ్ మీద ఎఫ్ఐఆర్ నమోదయింది.

ఆ వ్యవహారాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. పెళ్ళి సమయంలో ఇచ్చిన 32 పౌండ్ల బంగారాన్నీ బాధితురాలికి ఇప్పించాలని పళని సబ్‌కోర్టు జాయింట్ మేజిస్ట్రేట్‌కు సూచించింది. ఆ న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు రియాజ్ ఇంటిని సోదా చేసారు. అప్పటికే నస్రీన్ బంగారు ఆభరణాలన్నీ మాయమైపోయాయి. తర్వాత పోలీసులు సైతం ఏమీ చేయకుండా వదిలేసారు.

బాధితురాలి కుటుంబం మహిళా కమిషన్‌కు, మానవహక్కుల కమిషన్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఏ స్పందనా లేదు. డిఎస్‌పి బాధిత కుటుంబాన్ని కలిసి, తాను ట్రిపుల్ తలాక్ చట్టాన్ని అధ్యయనం చేసి తగుచర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పటివరకూ ఆయనా ఏమీ చేయలేదు.

నస్రీన్ ఫాతిమా కుటుంబం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ఆశ్రయించింది. అయితే ఈ విషయంలో ఎటువంటి చర్యా తీసుకోలేమంటూ సీఎంఓ నుంచి వచ్చిన సమాధానం ఆ కుటుంబాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ప్రభుత్వం మొదటినుంచీ ట్రిపుల్ తలాక్ చట్టానికి వ్యతిరేకంగానే ఉంది. కేంద్రం ఆ చట్టం చేసినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం సంస్థలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు బాధిత మహిళకు న్యాయం చేస్తే ముస్లిం సంస్థల నుంచి విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందనే భయంతోనే నస్రీన్ కేసును స్టాలిన్ కార్యాలయం పట్టించుకోలేదు. మహిళల సాధికారత, సమానత్వం గురించి గొప్ప కబుర్లు చెప్పే డీఎంకే ప్రభుత్వపు వాస్తవరూపం ఇది.

నిన్న బుధవారం బాధిత మహిళ కుటుంబం మీడియా ముందు తమ గోడు వెళ్ళబోసుకుంది. కుముదం న్యూస్, ఒన్ ఇండియా తప్ప మరే పత్రికా లేక ఛానెల్ ఆ వార్తను ప్రచురించలేదు లేక ప్రసారం చేయలేదు. ముస్లిం మహిళల దీన హీన స్థితిగతులపై మీడియా నిర్లక్ష్యానికిది నిదర్శనం. హిందూ మున్నని స్వచ్ఛంద సంస్థ ఒక్కటీ నస్రీన్ కుటుంబానికి అండగా నిలిచింది. పోలీసుల తీరును సామాజిక మాధ్యమాల్లో ఎండగట్టింది. నిందితుడిపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.