ArticlesNews

విద్యా వినయ సంపన్నత

44views

మనిషి కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకొనేందుకే పుడతాడంటారు. గడచే ప్రతి క్షణం జ్ఞానాన్ని బోధిస్తూనే ఉంటుంది. పుడమి తల్లి, కన్న తల్లికన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతాయి. అరిషడ్వర్గాలు ప్రమాదకరమైనవని, సద్గుణాలు ఆనందాన్నిస్తాయని సాధనతో తెలుసుకుంటాం. అందరూ అన్నింటా మేటి అనిపించుకోవడం సాధ్యం కాదు. అయితే మనిషి పుట్టింది మొదలు కాలం చేసే దాకా కొత్త సంగతులు తెలుసుకుంటూనే ఉంటాడు. జ్ఞానాన్ని సంపాదించడం మానవ ధర్మం. మరణించేలోగా అందాల్సిన జ్ఞానం అందకపోతే బతుకు నిష్ఫలమవుతుంది. వివేకులు జ్ఞాన సముపార్జనకు సదా సంసిద్ధులై ఉంటారు. పుణ్య క్షేత్రాలు, పర్యటక ప్రదేశాల్లో కొత్తగా జ్ఞానార్జన జరుగుతూ ఉంటుంది. విస్తృత పర్యటన వల్ల జీవితంపై కొత్త అవగాహన కలుగుతుంది. తమ పిల్లల నుంచి సైతం తల్లులు జ్ఞానార్జన చేసిన ఉదంతాలు మన సాహిత్యంలో కనిపిస్తాయి.

కపిల మహర్షి తన తల్లి అయిన దేవహూతికి, ఆదిశంకరులు తమ మాతృదేవి ఆర్యాంబకు, రమణ మహర్షి తన మాతృమూర్తి ఆలఘమ్మాళ్ కు ఆధ్యాత్మిక విద్య బోధించిన ఉదంతాలు లోక విదితం. దుష్టుల నుంచి వారి తమోగుణం పనికి రానిదని, సత్పురుషుల నుంచి వారి సత్వగుణం అనుసరణీయమనీ నేర్చుకుంటాం. ప్రకృతిలో పంచ భూతాలు మనిషి ఆనంద విషాదాలకు కారణం. పంచభూతాలు అనుకూలమైతే ఆనందం, ప్రతికూలమైతే దుఃఖం కలుగుతుంది. తానే ప్రపంచమనే అనుభూతి మిగిలి ఉన్నంత వరకు మనిషికి సుఖదుఃఖాలు తప్పవు అన్నారు కావ్యకంఠ గణపతి ముని. అజ్ఞానంతో మనిషి కామ క్రోధాది అరిషడ్వార్గాలను పోషించినంతగా ఆత్మీయులను ప్రేమించడు. కోపం కలిగినపుడు మనిషి ప్రవర్తన ఎంత వింతగా ఉంటుందంటే అతడు కోపాన్ని ప్రేమిస్తున్నాడా అనిపిస్తుంది. కోపం నుంచి విముక్తి పొంది ఎంత త్వరగా విచక్షణ మేల్కొందా అన్నది మనిషి సాధనపై ఆధారపడి ఉంటుంది. కోపిష్టి మనషులకు శాంతి లభించదు. కామమనే జిలుగు పొర కమ్మిన మూర్ఖుడికి ఆనందం దుర్లభమే. సీతమ్మ వారిని చెరపట్టడం రావణుడంత భక్తుడు, విద్యావంతుడు, మహా బలవంతుడు చేయాల్సిన పని కాదు. చెడుకాలం దాపురించిన వాడికి ఆరుంధతి నక్షత్రం కనబడదని, మిత్రవాక్యం వినపడదని, కొడిగట్టిన దీపపు వాసన ఆకళింపునకు రాదనీ కవి వాక్యం.

దేహ సౌందర్యం, సంపద, విద్య వల్ల మనిషిని అహంకారం ఆవహిస్తుంది. అందం కాలక్రమంలో నశించేది కాగా సంపద నిలకడ లేనిది. ఇక విద్యకు వినయమే అలంకారం. వడ్డించిన విస్తరి ఒదిగి ఉన్నట్లు, నిండు కుండ తొణకనట్లు- సంపద, విద్య, అందం ప్రాప్తించిన వ్యక్తులు అణకువ ప్రదర్శిస్తే రాజపూజ్యత వరిస్తుంది. అహంకరిస్తే తమ దోషాలే తమను కబళిస్తాయని, అవమానాల పాల్టేస్తాయని మనిషి గ్రహించాలి. వినయ గుణం వల్ల గౌరవాదరాలు లభిస్తాయి. అహంకరిస్తే జరిగేది నష్టమే గానీ ఒరిగేదేం ఉండదు. పుస్తకాల్లో నేర్చుకునేది విద్య. లౌకిక విద్యలు ఎన్ని నేర్చినా వినయ గుణం లోపిస్తే- దాని వల్ల సంప్రాప్తించే దుష్పలితాల నుంచి సాధకుడు తప్పించుకోలేడు. విద్యతో పాటు అబ్బిన వినయం సాధకుడి బతుకును శోభాయమానం చేస్తుంది.