ArticlesNews

తమస్సును చీల్చిన కాంతి పుంజం ‘‘గుర్రం జాషువా’’

71views

( జూలై 24 – గుర్రం జాషువా వర్ధంతి )

సమాజ సంస్కరణకు సాహిత్యాన్ని ఆయుధంగా ఎంచుకుని అసమానతలపై గళమెత్తిన నవయుగ కవి చక్రవర్తి. 19వ శతాబ్దం చివరి దశలో సామాజిక ప్రయోజనం కోసం నూతన ఒరవడితో రచనలు చేసి ప్రజలలో చైతన్యాన్ని రగిలించిన కవి సామ్రాట్. అతనే గుర్రం జాషువా. లోకమంతా ఒకే ఇల్లుగా ఉండాలని, వర్ణబేధాలు పోయి ప్రేమ బంధం కావాలని, అన్నదమ్ముల మాదిరి అందరూ ఉండాలని గురజాడ తన కవిత్వం ద్వారా చాటి చెప్పారు. ఈ విధంగానే గుర్రం జాషువా కూడా వసుదైక కుటుంబం కావాలని, అలాంటి సమాజం ఏర్పడాలని ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక అసమానతలు తొలగాలని కాంక్షిస్తూ తన కవిత్వాన్ని ఆయుధంగా ఉపయోగించుకొని సమాజంపై విరుచుకుపడ్డారు. స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వంలతో కూడినటువంటి సమాజం కావాలన్నదే జాషువా స్వప్నం. తానొక విశ్వనరుడిగా మెలగాలని, ప్రపంచ సోదరుడిగా నిలబడి వెలగాలని జాషువా ఆశయం.

ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సామాజిక చైతన్యం వైపు నడిపించిన గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28న పల్నాడు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడు గ్రామంలో గుర్రం వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులు వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో విద్యాభ్యాసంలో అనేక కష్టాలు, అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నాడు. 1910లో మేరీని పెళ్లి చేసుకున్నాక, మిషనరీ పాఠశాలలో ప్రాథమికోపాధ్యాయుడిగా నెలకు 3 రూపాయల జీతంతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన జాషువా తన జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేశారు. వీరేశలింగం, చిలకమర్తుల ఆశీర్వాదముతో కావ్య జగత్తులోకి అడుగుపెట్టిన జాషువా తిరుపతి వేంకట కవుల ప్రోత్సాహంతో ఆ రంగంలో ముందుకు సాగారు. తన బాల్య స్నేహితుడు దీపాల పిచ్చయ్య శాస్త్రి సహచర్యంలో జాషువా కవిత్వం పై ఆసక్తి పెంచుకోగా జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నాడు.

జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాసారు. వాటిలో ప్రముఖమైనది గబ్బిలం. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగే గబ్బిలం ఆయన రచనల్లో సర్వోత్తమైనది. ఈ కావ్యం ద్వారా దళితులకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటాడు. జాషువాలోని ఆవేదనలు సమాజానికి తెలియపరచడమే ఆయన రచనల సారాంశమని చెప్పడానికి ఫిరదౌసి ఒక నిదర్శనం. నిమ్నజాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కాల్చివేయును అని గర్జిస్తూ చాతుర్వర్ణ వ్యవస్థను నిలదీసి జాషువా విప్లవమూర్తిగా సాక్షాత్కరించాడు. సత్యహరిశ్చంద్ర నాటకంలో ‘ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలం నిప్పులో కరిగిపోయెను’ అంటూ స్మశానంలో కుల మత భేదాలు లేవంటూ రాజైనా, బంటైనా మరణం అందరికీ సమానమేనని తేల్చి చెప్పాడు. క్రీస్తు కథ, ముంతాజ్ మహల్ వంటి గ్రంథాల ద్వారా తన నాడిని స్పష్టంగా వినిపించి సామాజిక స్పృహను కలిగించిన అభ్యుదయ కవి గుర్రం జాషువా. ఈ మహాకవి జాతీయోద్యమ కాలంలో జాతి జనుల్లో భారతమాత గొప్పతనాన్ని చాటి చెప్పే అనేక విషయాలను తన కవిత్వంలో పొందుపరిచాడు. మహిళల సంక్షేమం కోసం, వారికి జరిగే అన్యాయాల పట్ల తన రచనల రూపంలో నిరసన గళం వినిపించాడు. ఏ సమాజం అయితే స్త్రీని జ్ఞానానికి దూరంగా బంధీని చేస్తుందో అటువంటి సమాజం ఆర్థికంగా అభివృద్ధి చెందదు అని స్పష్టీకరించాడు.

జాషువా ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో పరిమితమైన కవి కాదు. ఆయన జాతీయ కవీశ్వరుడు. ఆయన ఏది చేసినా ఏది రాసినా ఒక ప్రాంతానికో ఒక మతానికో పరిమితమై రచనలు చేయలేదు. దేశ ప్రజల బాధలే తన బాధలుగా భావించి సర్వ మానవ సౌభ్రాతృత్వం మానవత్వపు పరిమళాలు ఈ నేల పై పరిఢవిల్లాలని కోరుకున్నాడు. జాషువాను ఎన్నో పురస్కారాలు వరించాయి. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి..జాషువా కాలికి గండపెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి జన్మధన్యం చేసుకున్నానన్నారు. కవితా విశారద, కవి కోకిల, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్‌గా ప్రసిద్ధుడయ్యాడు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ, భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ పురస్కారం అందుకున్న జాషువా 1971 జూలై 24వ తేదీన కులమతాలు లేని అంటరానితనం లేని అమరపురికి చేరుకున్నారు. వారి ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేర్చడమే మనం ఆయనకు అందించే నిజమైన నివాళి.