News

18 నుంచి పవిత్రోత్సవాలు

41views

దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వచ్చే నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఉదక శాంతి, 18వ తేదీ ఉదయం తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, అనంతరం స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారితో పాటు మల్లేశ్వర స్వామి వారికి ఇతర ఉపాలయాలలో దేవతా మూర్తులకు పవిత్ర మాలధారణ జరుగుతుంది. ఉదయం 9 గంటల తర్వాతే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు గణపతి పూజ, మండపారాధన, అగ్నిప్రతిష్టాపన, సర్వప్రాయశ్చిత్త విధి తత్తత్‌ దేవతారాధన జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మూలమంత్ర హవనం, వేద పారాయణ, హారతి ఉంటుంది. 20వ తేదీ ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతి, కలశోద్వాసన, మహదాశీర్వచనంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.

మూడు రోజులపాటు సేవల నిలిపివేత..
దుర్గగుడిలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న మూడు రోజులు అన్ని ప్రత్యక్ష, పరోక్ష సేవలను నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. అమ్మవారికి తెల్లవారుజామున జరిగే ఖడ్గమాలార్చాన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, ఛండీహోమం, శాంతి కల్యాణంతో పాటు ఇతర ఆర్జిత సేవలను మూడు రోజుల పాటు నిలిపివేస్తారు.

26న కృష్ణాష్టమి వేడుకలు..
దుర్గమ్మ సన్నిధిలో ఆగస్టు 26వ తేదీన కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కృష్ణ భగవానుడికి పూజా కార్యక్రమాలు, అనంతరం లక్ష్మీ గణపతి విగ్రహం ఎదురుగా ఉన్న గోశాల వద్ద గోమాతకు పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు మహా మండపం కళావేదికపై దేవస్థాన పురాణ పండితులతో ఉపన్యాసం, సాయంత్రం 6.30 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.