News

వైభవంగా హనుమాన్‌ శోభాయాత్ర

47views

రామభక్త హనుమంతుడిని తలచుకుంటూ హనుమాన్‌ శోభాయాత్రను ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అంగరంగ వైభవంగా నిర్వహించారు. బైపాస్‌రోడ్డులోని అభయాంజనేయస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన హనుమాన్‌ శోభాయాత్ర రవితేజ కల్యాణ మండపం, పాత సినిమా హాలు మీదుగా సత్రం సెంటర్‌, మెయిన్‌ బజార్‌, చావడి, హిల్‌రోడ్డు, ఎరుకలసానినగర్‌, సోమశిల రోడ్డు సెంటర్‌, ఎల్‌ఆర్‌పల్లి, ఆర్టీసీ బస్టాండ్‌ తిరిగి మెయిన్‌ రోడ్డు మీదుగా మున్సిపల్‌ బస్టాండ్‌, దళితకాలనీల మీదుగా రవితేజ కల్యాణ మండపం వద్దకు చేరుకుంది. ఈ శోభాయాత్రలో ప్రత్యేక వాహనాలపై ఏర్పాటు చేసిన హనుమంతుడు, శ్రీరాముడు, సీతారామ, లక్ష్మణ, పట్టాభిషేకం విగ్రహాల అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. సుమారు 4 గంటల పాటు సాగిన ఈ శోభాయాత్రలో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజే సంగీతానికి యువకులు, మహిళలు, చిన్నారులు చేసిన కోలాటం నృత్యం, పండరీ భజన ఆకట్టుకున్నాయి. డీఎస్పీ ఎన్‌ కోటారెడ్డి, సీఐ జి వేణు, ఎస్సై ముత్యాలరావుతో పాటు వివిధ పోలీసు స్టేషన్ల ఎస్సైలు, పోలీసులు బందోబస్తు పర్యవేక్షణ చేశారు. శోభాయాత్రను చూసేందుకు పలు సెంటర్ల వద్ద మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా చూడడం కనిపించింది. శోభాయాత్ర అనంతరం సాంబశివ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకుడు కంచి పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు.