News

పాకిస్థాన్‌లో సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి: 8 మంది సైనికుల మృతి

55views

పాకిస్థాన్‌లో బన్నూ కంటోన్మెంట్‌పై భారీ ఉగ్ర దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నేడు పాక్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ విభాగం మీడియాకు దీని సమాచారం తెలియజేసింది. బన్నూ కంటోన్మెంట్‌పై 10 మంది ఉగ్రవాదులు సోమవారం దాడికి యత్నించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో గోడను కూల్చివేశారు. ఈ క్రమంలో ఎనిమిది మంది సైనికులు మృతి చెందినట్లు వెల్లడించింది. దీంతో పాక్‌ సైన్యం కూడా ఎదురుదాడి చేయడంతో దాదాపు 10 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్ర దాడి జరిగిన దాదాపు 24 గంటల తర్వాత పాక్‌ సైన్యం ప్రకటించడం గమనార్హం. దాడి జరిగిన ప్రదేశానికి దగ్గర్లోనే సైన్యానికి చెందిన కీలక సప్లై డిపో ఉంది. తొలుత ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు దాడి చేశారని.. వారి వెనక మరో 8 మంది వచ్చారని అధికారులు చెబుతున్నారు.

ఇక్కడ ఉగ్రదాడి పేలుళ్లు 15 కిలోమీటర్ల దూరంలోని డొమెల్‌ టౌన్‌లోకి స్పష్టంగా వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. కంటోన్మెంట్‌ ప్రాంతం మొత్తం నల్లటి పొగతో నిండిపోయినట్లు వారు చెబుతున్నారు. బాంబు పేలుళ్ల తీవ్రతకు చుట్టుపక్కల ఇళ్ల గోడలు బీటలు వారినట్లు పేర్కొన్నారు. అఫ్గాన్‌ సరిహద్దుల్లో పాక్‌ దళాలు తీవ్రస్థాయిలో ముప్పును ఎదుర్కొంటున్నాయి. మరోవైపు అఫ్గాన్‌లోని తాలిబన్లు డ్యూరాండ్‌ రేఖను అంగీకరించడం లేదు. ఈ ప్రాంతంలో టీటీపీ గ్రూపు చాలా చురుగ్గా ఉంది. ఈ గ్రూప్‌ అఫ్గానిస్థాన్‌లో స్థావరాలు ఏర్పాటుచేసుకొని కార్యకలాపాలను నిర్వహిస్తోంది. డిసెంబర్‌ 2023లో డేరా ఇస్మాయిల్‌ ప్రాంతంలో సైన్యంపై ఉగ్రవాదులు దాడి చేశారు. నాడు మొత్తం 23 మంది ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్‌ ప్రావిన్స్‌లో ఉగ్రవాదం గణనీయంగా పెరిగిపోయింది.