News

దర్గాలో తొక్కిసలాట.. వృద్ధుని మృతి

58views

ఉత్తర ప్రదేశ్ జలేసర్‌లో బడే మియా- చోటే మియా దర్గాలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆషాఢమాసంలోని మూడో శనివారం ఇక్కడ శని జాతర నిర్వహిస్తుంటారు. ప్రతీసారి మాదిరిగానే ఈసారి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనం ఇక్కడికి తరలివచ్చారు. వీధుల్లో ఎక్కడ చూసినా విపరీతమైన జనం ఉన్నారు. కనీసం నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితులు నెలకొన్నాయి.

దర్గాకు వచ్చిన ఫిరోజాబాద్ జిల్లా ఫరీహా పోలీస్ స్టేషన్‌లోని మీట్‌పురా గ్రామానికి చెందిన బదన్ సింగ్(70) తన కుటుంబం నుండి విడిపోయాడు. జనం మధ్య తిరుగుతూ, విపరీతమైన వేడి, జనం తాకిడి కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో స్థానికులు అతనిని ఇ‍క్కడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పంపగా, అక్కడి వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతరం బదన్‌ సింగ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

దర్గాకు వచ్చిన వారిలో మహిళలు, చిన్నారులు ఎండ తీవ్రతకు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూజలు చేసేందుకు అక్కడకు వచ్చినవారంతా పోటీ పడ్డారు. దీంతో తోపులాటలు జరిగాయి. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.