News

బుద్ధగయలో బయల్పడుతున్న పురావస్తు సంపద

231views

బిహార్‌లోని బుద్ధగయలో మహాబోధి ఆలయం కింద అపూర్వ పురావస్తు సంపద ఉందని భూతల సర్వేలు, ఉపగ్రహ చిత్రాల ద్వారా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. బిహార్‌ వారసత్వ వికాస సంఘం, బ్రిటన్‌లోని కార్డిఫ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు కలసి ఈ అధ్యయనం నిర్వహించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ చిహ్నమైన మహాబోధి ఆలయ కాంప్లెక్స్‌ బుద్ధుని జీవితంతో ముడిపడిన నాలుగు పుణ్య స్థలాల్లో ఒకటి. బుద్ధగయలోనే గౌతమ బుద్ధుడు నిర్వాణం పొందిన బోధి వృక్షం ఉంది. క్రీ.శ 638 నుంచి 645 సంవత్సరం వరకు హర్షవర్థనుడి పాలనలో చైనా యాత్రికుడు హ్యూయన్‌ త్సాంగ్‌ బిహార్‌తో సహా భారత్‌లో వివిధ బౌద్ధ స్థలాలను సందర్శించారు. మొత్తం 657 బౌద్ధ గ్రంథాలను సేకరించి మాండరిన్‌ భాషలోకి అనువదించారు. ఆయన రచనల ఆధారంగానే బ్రిటిష్‌ పురాతత్వవేత్త అలెగ్జాండర్‌ కనింగ్‌ హామ్‌ 1860-70 మధ్య తవ్వకాలు సాగించి నలంద, వైశాలిలను కనుగొన్నారు. ఆ తరవాత మళ్లీ పురావస్తు తవ్వకాలు జరగలేదు. తిరిగి ఇన్నాళ్లకు భూతల సర్వేలు, ఉపగ్రహాల సాయంతో మహా బోధి ఆలయం కింద కప్పబడిన పురాతన కట్టడాల ఆనవాళ్లను కనుగొనగలిగారు.