ArticlesNews

గరిమెళ్ళ పాట.. స్వాతంత్ర్యోద్యమ బాట..

56views

( జూలై 14 – గరిమెళ్ళ సత్యనారాయణ జయంతి )

‘మా కొద్దీ తెల్లదొరతనం’ అంటూ స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజలను ఉర్రూతలూగించి ఉవ్వెత్తున ఎగసిపడిన ఉత్తుంగ ఉద్యమ తరంగం, దండాలు దండాలు భారతమాత వంటి గీతాలతో బ్రిటిష్ దొరలను గడగడలాడించాడు. తన పాటల తూటాలతో మాటల పంజాతో తెల్లదొరల వెన్నుల్లో వణుకు పుట్టించాడు. ఆయనే మన అచ్చ తెలుగు కవి గరిమెళ్ళ సత్యనారాయణ. ప్రజల్లో ఉత్తేజాన్నీ, ధైర్యాన్నీ, స్ఫూర్తినీ నింపే దేశభక్తి గీతాలను రాసి జైలు శిక్ష అనుభవించిన మొదటి కవి గరిమెళ్ళ సత్యనారాయణ. ఉద్యమ సమయంలో జైలు జీవితం గడుపుతూ తన తండ్రినీ, తాతనీ, భార్యనీ పోగొట్టుకుని కూడా ప్రజల కోసం, దేశం కోసం పోరాడి తన జీవితాన్ని దేశవిముక్తి కోసం అర్పించిన నిజమైన దేశభక్తుడు గరిమెళ్ళ సత్యనారాయణ.

సుకవి జీవించు ప్రజల నాల్కలయందు అనే జాషువా మాట గరిమెళ్ళ సత్యనారాయణకు అక్షరాలా అతికినట్లు సరిపోతుంది. చిరకాలం ప్రజల నాల్కల మీద నర్తించే పాటను రాసిన గరిమెళ్ళ సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామంలో 1893 జూలై 14న జన్మించారు. తల్లి సూరమ్మ, తండ్రి వెంకట నరసింహం. స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. తర్వాత విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రిలలో ఉన్నత విద్యాభ్యాసం కొనసాగింది. బి.ఎ. పూర్తి చేశాక కొంతకాలం గంజాం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగాను, మరికొంతకాలం విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. 1920 డిసెంబర్‌లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ఇచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమం పిలుపుతో స్ఫూర్తి పొందిన గరిమెళ్ళ స్వాతంత్ర్య పోరాటంలోకి దూకారు. మాకొద్దీ తెల్లదొరతనం అంటూ గొంతెత్తి పాడుతూ రాజమండ్రి వీధివీధినా తిరిగారు.

సముద్ర ఘోషలాంటి గరిమెళ్ళ పాట తెల్లదొరల గుండెల్లో సునామీలు సృష్టించింది. దీంతో ఆయనకు కఠిన కారాగార శిక్ష విధించారు. గరిమెళ్ళ జైలులో ఉండగా ఆయన తండ్రి మరణించారు. అప్పుడు బ్రిటిష్ అధికారులు, పాటలు పాడనని క్షమాపణలు చెబితే విడుదల చేస్తామన్నారు. గరిమెళ్ళ ఇందుకు అంగీకరించక శిక్షాకాలం పూర్తయ్యే వరకు జైలులో ఉండటానికే ఇష్టపడ్డారు. జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాక ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. చాలా చోట్ల ఆయనకు ఘన సన్మానాలు చేశారు. అయితే స్వాతంత్ర్యానంతరం నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురై, ఏ విధమైన సహాయ సహకారాలు లభించక గత్యంతరం లేని పరిస్థితుల్లో పొట్టకూటి కోసం చివరకు బిక్షాటన సైతం చేసి దుర్భర, దీన, నిస్సహాయ స్థితిలో ఆకలితో 1952 డిసెంబర్ 18న గరిమెళ్ళ సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు.

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అవిశ్రాంత పోరాటం చేసి కూడా ఏ విధమైన గుర్తింపునీ పొందక ఆస్తుల్ని, ఆప్తుల్ని పోగొట్టుకుని అనామకులుగా మిగిలిపోయిన త్యాగమూర్తుల జాబితాలో చేరిన వందలాది నిర్భాగ్యుల్లో ఒకరు గరిమెళ్ళ సత్యనారాయణ. ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలి. ఇదే గరిమెళ్ళ సత్యనారాయణకు మనం ఇచ్చే నివాళి.