ArticlesNews

ప్లాస్టిక్‌ వ్యర్థాలపై పోరాటం… కూలంకషంగా వివరిస్తూ అవగాహన కలిగిస్తున్న సుబిమల్ దత్తా

66views

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వాహణ. ఎటు చూసినా… ఇదే. సముద్రంతో సహా ఎక్కడ చూసినా.. గుట్టలు గుట్టలుగా ప్లాస్టిక్‌, దాని వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. వందల సంవత్సరాలు గడిచినా.. నేలలో ఈ ప్లాస్టిక్‌ కలిసిపోదు. ఈ నేపథ్యంలో చాలా మంది వ్యక్తులు సమూహంగా, సంస్థలుగా సంఘటితమై.. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ప్లాస్టిక్‌ కి ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నారు. ప్లాస్టిక్‌కి బదులుగా బట్ట సంచులు, మట్టి పాత్రలను సూచిస్తున్నారు. కాస్తలో కాస్త ఇప్పుడు ప్రత్యామ్నాయం వైపు ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు. అయినా.. ఎవరికి వారు అవగాహన కల్పిస్తూ… సమాజ సేవ చేస్తున్నారు. ఇదే మార్గంలో పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకి చెందిన సుబిమల్‌ దత్తా.. ఆరోగ్య శాఖలో పనిచేస్తూ… ప్లాస్టిక్‌ను నియంత్రించడానికి పనిచేస్తున్నారు. విద్యాసాగర్‌ విశ్వవిద్యాలయం నుంచి సోషల్‌ వర్క్‌లో పీజీ పూర్తి చేసిన.. సుబిమల్‌ దత్తా.. తన ప్రాంతంలోని పజ్రలకు ప్లాస్టిక్‌తో కలిగే ప్రతికూల ప్రభావాలను వివరిస్తున్నాడు.

ప్రజలు వాడి పారేసే ప్లాస్టిక్‌ వ్యర్థాలను సరిగ్గా నిర్వహించకపోతే అవి నాలాలు, కాలువలు, నదుల ప్రవాహాలను ఎలా అడ్డుకుంటాయి? ప్లాస్టిక్‌ ను ఎందుకు వాడకూడదు? ప్లాస్టిక్‌ వ్యర్థాలు వరదలకు ఎలా కారణం అవుతున్నాయి? రకరకాల వ్యాధి కారక క్రిములకు ఎలా మారిపోతాయో? ఇలా కూలంకషంగా అందరికీ వివరిస్తున్నాడు. దక్షిణ 24 పరగణాల్లోని అనేక గ్రామ పంచాయితీలను ప్లాస్టిక్‌ రహిత మండలాలుగా మార్చే దిశగా ప్రయాణం సాగిస్తున్నారు. వచ్చే తరాల వారికి ప్టాస్టిక్‌ భూతం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత నిబద్ధత, అకుంఠిత భావంతో పనిచేస్తున్నాడు.

ప్లాస్టిక్‌ వ్యర్థాలకి వ్యతిరేకంగా 2021లో ప్రచారాన్ని ప్రారంభించాడు దత్తా. అతడు చేస్తున్న సామాజిక కార్యక్రమాన్ని చూసి కొందరు ఆకర్షితులై.. ఆయనతో భుజం భుజం కలిపి నడుస్తున్నారు. పర్యావరణ వ్యవస్థలు ఎలా దెబ్బతింటాయి? ప్రజారోగ్యంపై ప్లాస్టిక్‌ ఎలా దెబ్బతీస్తుంది? అంటూ వివరిస్తున్నారు. దీని కోసం ఓ సమగ్ర మిషన్‌ను ప్రారంభించారు. అలాగే ప్టాస్టిక్‌ వ్యర్థాలు సంతానోత్పత్తి విషయంలో కూడా ఎలా ప్రభావితం చేస్తుందో చెబుతున్నారు. ప్రజలతో ముఖాముఖీలు నిర్వహించడం, వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తూ… సామాజిక స్పృహను పెంచుతున్నాడు. దీనిలో కొంత విజయం కూడా సాధిస్తున్నారు.

కేవలం అవగాహన, వర్క్‌షాపులు మాత్రమే కాకుండా ప్లాస్టిక్‌ వ్యర్థాలను నిర్వహించడం ఎలాగో ప్రయోగాత్మకంగా పరిష్కారాల ద్వారా కూడా సూచిస్తున్నాడు. ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా వున్న నేలలో క్షయం చెందే బయోడీగ్రేడబుల్‌ వస్తువుల వాడకాన్ని, వాడేసిన ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నాడు. తన ప్రయత్నాల్లో భాగంగా దత్తా స్థానికంగా వుండే అధికారులు, విద్యా సంస్థలు, పౌర సమాజం సహకారం కూడా తీసుకుంటున్నాడు. కేవలం కంటికి కనిపించే ప్టాస్టిక్‌ గుట్టల గురించి మాత్రమే కాకుండా ఈ కంటితో చూడలేని మైక్రోప్లాస్టిక్‌ ద్వారా మనిషి, జంతువుల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాల గురించి కూడా దత్తా చైతన్యం తీసుకొస్తున్నారు.