News

దొంగలు పశ్చాత్తాపం చెందారు..

32views

ఒకసారి రామభక్తుడైన గోస్వామి తులసీదాసు రాత్రివేళ వాహ్యాళిగా నడచివెళ్తున్నాడు. కొందరు దొంగలు ఆయనను అడ్డగించి ‘ఎవరు నువ్వు?’ అనడిగారు. అందరమూ ఆ రాముని వారమే అన్న మానసిక భావనతో ‘నేను మీ వాడినే’ అని జవాబిచ్చాడు తులసీదాసు. అది విన్న ఆ చోరులు అతనూ తమ లాగే దొంగే అని భ్రమపడ్డారు. దొంగతనంలో సాయపడతాడని తమతో పాటు తీసుకువెళ్లారు. ఒక ఇంట్లో దొంగతనం చేయటానికి లోపలికి వెళ్తూ ఆ రామభక్తుడితో ‘నువ్వు బయట నిలబడు! ఎవరైనా వస్తే వెంటనే శంఖం ఊదు. మేము బయటకు వచ్చేస్తాం’ అని ఆయన చేతికి ఓ శంఖం ఇచ్చారు. దొంగలు లోపలికి వెళ్లిన కొన్ని క్షణాలకే తులసీదాసు శంఖం పూరించాడు. ఎవరో వస్తున్నారు కాబోలు అనుకుని ఆదుర్దాతో దొంగలు బయటకు పరుగెత్తుకొచ్చారు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. వారు ఆ రామదాసుడిని దూషిస్తూ ‘ఇక్కడ ఎవరూ లేరు కదా! ఎందుకు శంఖం ఊదావు?’ అని గద్దించారు. అప్పుడు తులసీదాసు ‘అయ్యా! ఇక్కడ, అక్కడ అని లేదు. అంతటా నా ప్రభువు శ్రీరామచంద్రుడే కనిపిస్తున్నాడు. ఆయన దురాగతాలు చేసేవారిని ఎంతమాత్రం ఇష్టపడడు. దొంగతనం చెడ్డపని. మీరెవరూ ఆయన ఆగ్రహానికి గురికాకూడదనే నేను శంఖం ఊదాను’ అన్నాడు. ఆ మహానుభావుడి మాటలు వినడంతో ఆ దొంగల్లో పశ్చాత్తాపం కలిగింది. తర్వాతెన్నడూ చౌర్యం చేయకపోవడమే కాదు వారి ప్రవర్తనలో గొప్ప మార్పు వచ్చింది.