News

కశ్మీర్‌లో హిందువులను ఉగ్రవాదుల నుంచి రక్షించాలి: డచ్ ప్రధాని

17views

జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో జూన్ 10న ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసిన ఘటనపై నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గీర్ట్ విల్డర్స్ తీవ్రంగా స్పందించారు. ‘‘భారతదేశమా, హిందువులను చంపేందుకు కశ్మీర్ ‌లోయలోకి పాకిస్తానీ ఉగ్రవాదులను రానీయవద్దు. మీ దేశ ప్రజలను కాపాడుకో’’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసారు. రియాసీ జిల్లాలో పాకిస్తానీ ఉగ్రవాదుల దాడిలో 9మంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

పాకిస్తాన్‌లో ఉగ్రవాదం గురించి గీర్ట్ విల్డర్స్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో హిందువుల దురవస్థల గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. మహమ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యల విషయంలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ వైఖరిని ఆయన సమర్ధించారు.

గీర్ట్ విల్డర్స్ ఈ యేడాది మొదట్లో నూపుర్ శర్మతో ఫోన్‌లో సంభాషించారు. ఆమెను భారతదేశానికే కాక మొత్తం ప్రపంచానికే స్వేచ్ఛకు చిహ్నంగా అభివర్ణించారు. ఇస్లాం గురించి బహిరంగంగా, కచ్చితంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయనకు ఎన్నోసార్లు హత్య బెదిరింపులు వచ్చాయి. దాంతో ఆయన సుమారు 20 ఏళ్ళపాటు ఇళ్ళు మారుతూనే ఉన్నారు. ఒక దశలో పోలీసు భద్రత కూడా తీసుకున్నారు.

గతేడాది ఒక మీడియా సంస్థతో మాట్లాడిన విల్డర్స్ ‘‘పాకిస్తాన్ నుంచి, అరబ్ ఇమామ్‌ల నుంచి నా మీద ఎన్నో ఫత్వాలు జారీ అయ్యాయి, కానీ నాకు భయం లేదు’’ అని చెప్పారు.

విల్డర్స్ పివివి ఫ్రీడం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ పార్టీ గతేడాది జరిగిన జాతీయ ఎన్నికల్లో అనూహ్యంగా భారీ విజయాలు నమోదు చేసింది. నెదర్లాండ్స్‌లో మొదటిసారి సంకీర్ణ ప్రభుత్వంలో పివివి ఫ్రీడం పార్టీ భాగస్వామి కాబోతోంది.