ArticlesNews

పంచ సరోవరాలు

35views

తీర్థ తీరాల్లో వెలసిన క్షేత్రాలకు చేసే యాత్రలనే తీర్ధయాత్రలంటారు. మన దేశంలో ఎన్నో జల వనరులున్నాయి. వాటిలో పంచ సరోవరాలు ప్రసిద్ధమైనవని పురాణాలు చెబుతున్నాయి. అవి మానస, పంపా, పుష్కర్, నారాయణ, బిందు అనే అయిదు.

మానస సరోవరాన్నే బ్రహ్మ సరోవరమనీ అంటారు. ఇది హిమాలయాల్లో కైలాస పర్వతం దగ్గర ఉంది. బ్రహ్మదేవుడి మనసులోని ఆలోచనల నుంచి ఏర్పడిందని దీనికి పేరు. ఐతిహ్యం జ్ఞానానికి, అందానికి ప్రతీకలైన హంసలు విహరిస్తుంటాయని ప్రతీతి.

కర్ణాటకలోని హంపీలో ఉన్న పంపాసరోవరం రామాయణ కాలం నాటిదని ప్రసిద్ధం. శబరి మతంగ మహర్షి సప్తసాగరాల జలాలూ ఒక చోట నిలిచేట్లుగా ఒక మహిమాన్వితమైన సరస్సును సృష్టించుకున్నారని, దానికే ‘పంపాసరోవరం’ అని పేరు పెట్టారని సారాంశం.

పద్మపురాణంలో పుష్కర సరోవరం గురించి వివరంగా ఉంది. ఒకసారి బ్రహ్మదేవుడు భూలోకానికి రాగా, ఇక్కడి చెట్ల కోరిక మేరకు బ్రహ్మదేవుడు తన ఆలయాన్ని, ఒక సరస్సును సృష్టించి పుష్కర సరోవరం అని పేరు పెట్టాడట. రాజస్థాన్లో అజ్మీరుకు ఏడు మైళ్ల దూరంలో ఈ సరస్సు ఉంది.

నారాయణ సరోవరం గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉంది. విష్ణువు దాల్చిన ఇరవైఒక్క అవతారాల్లో నరనారాయణ అవతారం ఒకటి నరనారాయణుల పాదాలు భూమిని తాకగా ఈ సరస్సు ఏర్పడిందంటారు.

బిందు సరోవరం గుజరాత్లో సరాన్ జిల్లా, సిద్ద్ పూర్లో ఉంది. స్వాయంభువు మనువు కళ్ల నుంచి ఆనందబాష్పాలు వెలువడిన బిందువులతో ఏర్పడిన సరోవరానికే బిందు సరోవరమని పేరు వచ్చిందని కథనం ఈ సరోవరం ఒడ్డున ఉన్న రావిచెట్టు కింద వేశంలో మరెక్కడా లేని విధంగా స్త్రీ మూర్తులకు మాత్రమే తర్పణాలను విడవడం విశేషం.

పితృదేవతలకు తర్పణాలను అర్పించాలనుకునేవారు ఈ పంచసరోవర యాత్ర చేస్తుంటారు.