News

హిందూ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు

61views

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. హిందూ యాత్రికులతో వెళుతున్న ఒక బస్సుపై ఆదివారం సాయంత్రం కాల్పులకు దిగారు. దీంతో ఆ వాహనం అదుపు తప్పి, పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా.. 33 మంది గాయపడ్డారు. రియాసీ జిల్లాలో ఈ దారుణం జరిగింది.

53 సీట్లున్న ఈ బస్సు శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళుతోంది. తెర్యాత్‌ గ్రామం వద్ద ఈ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. దీంతో వాహనంపై అతడు నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. 9 మృతదేహాలను వెలికితీసినట్లు రియాసీ జిల్లా సీనియర్‌ ఎస్పీ మోహితా శర్మ తెలిపారు. గాయపడినవారిని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు వివరించారు. మృతులంతా ఉత్తర్‌ప్రదేశ్‌ వాసులని భావిస్తున్నారు

యాత్రికులపై దాడి బాధాకరమని కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలిపారు. దీనికి బాధ్యులైన వారిని వదిలేది లేదని స్పష్టంచేశారు. బాధితులకు వైద్య సాయం అందించేందుకు స్థానిక యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందన్నారు.

పాకిస్థాన్‌ నుంచి వస్తున్న ఉగ్రవాద ముఠాలతో పొంచి ఉన్న ముప్పునకు ఈ ఘటన అద్దంపడుతోందని విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) పేర్కొంది.