
విజయనగరంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హిందూ ధర్మ రక్ష సమితి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో శనివారం భారీ హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నామని సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాల్, అధ్యక్షుడు అబోతుల శ్యాంసుందర్‌లు ప్రకటించారు. శుక్రవారం ఈ మేరకు స్థానిక ప్రైవేట్ కల్యాణమంటపంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి శఠగోపం పార్థసారథితో కలిసి వారు మాట్లాడారు. కొత్తపేటలో గల కొత్తకోవెల నుంచి హనుమాన్ విగ్రహాలతో కార్యక్రమం ప్రారంభమై సాయంత్రం కోట నుంచి మూడు లాంతర్లు జంక్షన్, గంటస్తంభం, కన్యకాపరమేశ్వరి కోవెల, రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్ మీదుగా తిరిగి కోట జంక్షన్‌కు శోభాయాత్ర చేరుకుంటుందని తెలిపారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ హనుమాన్ శోభా యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హనుమాన్ సహిత సీతారాముల వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.





