News

భానుడి క్షేత్రంలో భక్తులకు చుక్కలు!

85views

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. జనాల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అస్తవ్యస్తంగా ఉన్న క్యూలైన్లు, పర్యవేక్షణ లోపం, అరకొర సదుపాయాలతో చుక్కలు కనిపించాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో స్వామి దర్శనానికి క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని చూసి కొందరు బయట నుంచే స్వామికి దండం పెట్టుకుని వెనుదిరిగారు.
వైశాఖమాసం మూడో ఆదివారం కావటంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఉచిత దర్శనానికి 4-5 గంటలు, రూ.100 టికెట్‌ తీసుకున్నవారికి 3 గంటలుపైబడి, రూ.500 టికెట్‌ వారికి గంటకు పైగా సమయం పట్టింది. అన్నదాన ప్రసాదం కౌంటర్లు, కేశఖండనశాల వద్ద సైతం విపరీతమైన రద్దీ కనిపించింది. పోలీసులు బందోబస్తు నిర్వహించినా క్యూలైన్లలో స్వల్ప తోపులాటలు చోటు చేసుకున్నాయి. వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడ్డారు. కొందరు బారికేడ్లు దూకి క్యూలైన్లలోకి మధ్యలో నుంచి వెళ్లి పోతున్నా నిలువరించే వారే లేకుండా పోయారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఒక దశలో రూ.500, రూ.100 టిక్కెట్ల విక్రయాలు నిలిపివేశారు. కాసేపటి తరవాత ఆలయ ఆదాయం దెబ్బతింటుందని అధికారులు వారికి నచ్చచెప్పి మళ్లీ టిక్కెట్ల విక్రయాలు చేపట్టారు. ఆర్జిత సేవలు, టిక్కెట్ల విక్రయాల ద్వారా ఒక్కరోజులో రూ.12.92 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు.