ArticlesNews

తొలి వార్తాహరుడు, ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

129views

( మే 24 – నారద జయంతి )

నారదుడు దేవర్షి, సంగీతజ్ఞుడు, నిరంతర లోక సంచారి. ఆయన ఒక ”ఆదర్శ పాత్రికేయుడు”. మంచిచెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మ పక్షమే. కృత, త్రేతా, ద్వాపర యుగాలన్నిటిలోనూ ఆయన ఉంటాడు. నారదుడి పేరు ప్రస్తావించని హిందూ పురాణం లేదు. అష్టాదశ పురాణాలు, రామాయణ, మహా భారతాల్లోనూ నారదుడు పాత్ర గురించి వివరించారు.

నారదుని జన్మతిధి వైశాఖ బహుళ పాడ్యమి. ఈ తిధినాడే నారద జయంతిని జరుపుకునే సాంప్రదాయం ఉంది. ఈ 2024 సంవత్సరంలో మే 24న ఆయన జయంతి జరుపుకుంటున్నాము. నారదుడు మూడు లోకాల్లోను సంచరిస్తూ భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటాడు. కొంతమంది ఆయన్ను ‘కలహ భోజనుడు’గా ‘కలహ ప్రియుడు’ గా అభివర్ణించారు. వాస్తవానికి, నిజం మాట్లాడే వారికి ఎప్పుడు కష్టాలే. ”యదార్ధవాది లోక విరోధి”

బ్రహ్మ మానస పుత్రుడు, త్రిలోక సంచారి, నారాయణ భక్తుడు, ముక్తుడు అయిన నారదుడు విశ్వహితుడు. తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సినిమాలలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచు ప్రస్తావించబడుతాయి.

వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములలో నారద పురాణం ఒకటి. నారద పురాణాన్ని నారదీయ పురాణం అనికూడా పిలుస్తారు. ఈ పురాణంలో వేద వేదాంగాలు, వివిధ దేవతా కవచాల గురించి చెప్ప బడింది. నారం అంటే జ్ఞానం. జ్ఞానం నిరంతర ప్రవాహితం. ప్రస్తుత కాలంలో పాత్రికేయులు నారదుని ఆదర్శంగా తీసుకొని, జ్ఞాన పిపాసులై, తాము సముపార్జించిన విజ్ఞానాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేయాలి. ధర్మం, న్యాయం, సత్యం ఆచరణకు ప్రజలను కార్యోన్ముఖులను చేయాలి. ఆ మార్గంలో పాత్రికేయులకు మహర్షి నారదుని జీవితం పరమ ఆదర్శం.