ArticlesNews

సామాజికపద పితామహుడు అన్నమయ్య

110views

(తాళ్ళపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాల సందర్భంగా…)

అన్నమయ్య… ఈ పేరు వినగానే మనకు గొప్ప వాగ్గేయకారుడని, మహాభక్తుడని, సంకీర్తనాచార్యుడని ఆంధ్రపదకవితా పితామహుడుని మాత్రమే గుర్తుకు వస్తుంది తప్ప ఆయనలోని సామాజికతను తలచుకునేవారు చాలా తక్కువ. ఆయన పదాలను విశ్లేషించి చూస్తే అన్నమయ్య అసలైన సామాజిక కవి, అనే విషయం తేటతెల్లమవుతుంది.

అన్నమయ్య 32,000వేల కీర్తనలు రచించాడనీ, వాటిల్లో 12,000వేలు దొరికాయని చరిత్రాకారుల అంచనా.. దక్షిణాదిత్య భాషల్లో ప్రప్రథమ వాగ్గేయకారుడు అన్నమయ్య. కన్నడ వాగ్గేయకారుడైన పురంధర దాసు కూడా అన్నమయ్య తరవాతివాడే…

అన్నమయ్య సామాజిక బాధ్యత ఉన్న కవి కాబట్టే భక్తి మార్గంలోనే సామాజిక సమస్యలను ఎత్తిచూపుతూ, సామాజిక రుగ్మతలను రూపుమాపడం, సామాజిక అంతరాలను తొలగించడం అన్నవే భగవంతుని ఆరాధనా మార్గాలని తన సంకీర్తనల్లో కీర్తించాడు. బ్రహ్మమొకటే అంటూ కీర్తించాడు. ఏ కులజుడైన నేమి ఎవ్వరైననేమి ఆ కడనాతడే హరినెరిగినవాడు అంటూ కులతత్వాన్ని నిందించాడు. ‘కందువగు హీనాధికము లిందులేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ’ అంటూ.. సృష్టిలో ఎలాంటి అంతరాలు లేవు, అంతరాలన్నీ మనుషులు సృష్టించుకొన్నవే అంటాడు.

‘‘చేరి యశోదకు శిశువితడు… ధారుణి బ్రహ్మకు దండ్రియు నితడు’’ అన్న సంకీర్తనలో – భగవంతుడు గొప్పవాళ్లకు గొప్పగా, తక్కువవాళ్లకు తక్కువగా ఉండడు. అందుకు వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు. అందుకని ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అన్నది నిర్ణయించే హక్కు మనుషులకు లేదని చాటాడు అన్నమయ్య.

ఇంత అద్భుతంగా భగవంతుడి అనంతమైన తత్వాన్ని ఆవిష్కరించిన సామాజికపద పితామహుడు అన్నమయ్య భక్తితత్వాన్ని, సామాజిక తత్వాన్ని ఆకళింపు చేసుకొని, ఆచరణలో పెట్టగలిగితే మంచి సమాజాన్ని తీర్చిదిద్దగలం.