News

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ స్త్రీ శక్తికి ప్రతీక : శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి స్వామీజీ

97views

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ స్త్రీ శక్తికి, సాధికారతకు ప్రతీక అని, ఆమె కాలంలోని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన భక్తులలో ఒకరిగా నిలిచారని విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామిస్వామీజీ పేర్కొన్నారు. వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు బుద‌వారం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఘనంగా జరిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి స్వామీజీ అనుగ్రహభాషణం చేస్తూ, ఆనాటి సామాజిక పరిస్థితుల్లో ఒక స్త్రీ తపస్సు చేయవచ్చా, అరణ్యాలలో ఒంటరిగా ధ్యానం చేయవచ్చా అనే మూఢనమ్మకాల వలన చాలా కష్టాలు అనుభవించి పరమాత్ముని దర్శిస్తూ స్త్రీ మూర్తి జ్ఞానమూర్తిగా మారిందన్నారు.

శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని, శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆరాధ్యదేవతలుగా వెంగమాంబ ఉపాసించారని తెలిపారు. 87 ఏళ్ల వయసులో శ్రీవారి ఆమోదంతో వెంగమాంబ సజీవ సమాధి అయ్యారని చెప్పారు. టీటీడీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు స్వామీజీ అభినందించారు.అంతకుముందు స్వామీజీ వెంగమాంబ సంకీర్తనల రెండు పుస్తకాలు, సీడీని విడుదల చేశారు.

ముందుగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ ప్రారంభమైంది.