News

ముస్లింల ఓబీసీ హోదా రద్దు

263views

పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం ఉప కులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2010 తరువాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉప కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని పేర్కొంది. ఈ కులాలను ఓబీసీలుగా ప్రకటించడానికి మతాన్ని ఏకైక ప్రామాణికంగా పరిగణించారని వ్యాఖ్యానించింది.

2010 ఏప్రిల్‌ – సెప్టెంబరు మధ్య 77 కులాలను ఓబీసీలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను, 2012 చట్టం ఆధారంగా కొత్తగా చేర్చిన మరో 37 కులాల ఓబీసీ హోదాను కోర్టు కొట్టివేసింది. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో 2011 మే వరకు సీపీఎం ప్రభుత్వం ఉండగా, ఆ తర్వాత టీఎంసీ అధికారంలోకి వచ్చింది. 2010కి ముందు రాష్ట్ర ప్రభుత్వం 66 కులాలను ఓబీసీలుగా వర్గీకరించడాన్ని ఎవరూ సవాలు చేయనందున అందులో తాము జోక్యం చేసుకోవడం లేదని కోర్టు తెలిపింది. ఓబీసీల రిజర్వేషను శాతాన్ని 7 నుంచి 17 శాతానికి పెంచుతూ 2010 సెప్టెంబరులో జారీ చేసిన ఉత్తర్వులను సైతం ధర్మాసనం కొట్టివేసింది.