News

అప్పన్న ఆలయంలో నేడు నృసింహ జయంతి

62views

వైశాఖ శుద్ధ చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో శ్రీనృసింహ జయంతి వైభవోపేతంగా జరగనుంది. ఆ మేరకు దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో అధికారులు, వైదిక పెద్దలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది చతుర్దశి తిథితో పాటు స్వామివారి ఆవిర్భావ తార స్వాతి నక్షత్రం కూడా ఒకేరోజు వచ్చిన నేపథ్యంలో మరింత విశేషంగా వేడుక నిర్వహించాలని నిర్ణయించారు.

నృసింహ వనంలో: నృసింహ జయంతిని పురస్కరించుకుని కృష్ణాపురంలో దేవస్థానానికి చెందిన నృసింహ వనంలోని గుట్టపై కొలువైన నరసింహ స్వామి సన్నిధిలో విశేష పూజలు జరుగుతాయని ఈవో తెలిపారు. సాయంత్రం 4గంటల నుంచి అప్పన్న ఆలయ అర్చకులు స్వామికి ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారన్నారు.
దర్శన వేళలు, ఆర్జిత సేవల్లో మార్పు: నృసింహ జయంతి సందర్భంగా బుధవారం మధ్యాహ్నం సమయంలో దర్శనాలు కొనసాగుతాయని, మధ్యాహ్నం జరగాల్సిన రాజభోగం మహానివేదన సంధ్యా సమయంలో ఉంటుందని ఈవో తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు విరామం లేకుండా దర్శనాలు లభిస్తాయన్నారు. సాయంత్రం 5గంటల తర్వాత దర్శనాలు నిలిపివేసి ఆలయ సంప్రోక్షణ, నృసింహ జయంతి పూజలు నిర్వహిస్తారని, ఈ నేపథ్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఈవో వివరించారు.