
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం రథోత్సవం కనులపండువగా జరిగింది. తొలుత యాగశాలలో తితిదే పాంచరాత్ర ఆగమ సలహాదారుల కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. అనంతరం రథంగ ప్రతిష్ఠ, రథాన్యాసం తదితర పూజలు శాస్త్రోక్తంగా జరిపారు. సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ఆలయం నుంచి మేళతాళాలతో తీసుకొచ్చి తేరుపై కూర్చోబెట్టారు. ఉదయం 10.33 గంటలకు తేరు చక్రాలు కదిలాయి. భక్తులు జై శ్రీరామ్.. జై శ్రీరామ్.. గోవిందా.. గోవిందా.. కోదండ రామయ్యా కదిలిరావయ్యా అంటూ నినదించారు. మండుటెండలోనూ భక్తిభావంతో పెద్దసంఖ్యలో భక్తులు రథాన్ని లాగడానికి పోటీపడడంతో పురవీధులు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం 12.07 గంటలకు నడి గంగమ్మ గుడి వద్దకు రాగానే భోజనం విరామమిచ్చి రథాన్ని నిలిపారు. తిరిగి సాయంత్రం 3.50 గంటలకు కదిలింది. కోలాట నృత్య ప్రదర్శనలు, కేరళ వాద్యం, డప్పులతో సాయంత్రం 5.04 గంటలకు రథ మండపానికి తేరు చేరింది.





