News

మయన్మార్‌లో రోహింగ్యా ఉగ్రవాదుల చెరలో 1600మందికి పైగా హిందువులు

45views

రోహింగ్యా ఉగ్రవాదులు 2017లో మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో పాల్పడిన హిందువుల ఊచకోత వంటి ఘటన పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అరాకన్ రాష్ట్రంలోని బుతిడాంగ్ ప్రాంతంలో పెద్దసంఖ్యలో హిందువులు, బౌద్ధులను ఇస్లామిక్ ఉగ్రవాదులు చెరపట్టిన సంగతి వెలుగుచూసింది.

‘‘బుతిడాంగ్‌ ప్రాంతంలో క్షణక్షణానికీ ఉద్రిక్తత, అస్థిరత పెరిగిపోతున్నాయి. మయన్మార్ సైన్యం ఆదేశాల మేరకు ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులు పనిచేస్తున్నాయి. స్థానిక ప్రజలను వారి మతం ఆధారంగా చంపేసి, భయభ్రాంతులను చేయాలని సైన్యం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇస్లామిక్ గ్రూపులు అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం వారి చెరలో 1600 మందికి పైగా హిందువులు, 120కి పైగా బౌద్ధులూ ఉన్నారు’’ అని పేరు చెప్పడానిక ఇష్టపడని ఒక అధికారి వెల్లడించారు. బందీలుగా ఉన్న వారి విడుదల సంగతి తర్వాత, అసలు వారు ప్రాణాలతో బ్రతికి ఉన్నారో లేదో తెలియడం లేదు.

జాతుల పేరిట, మతం పేరిట ఘర్షణల్లో స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నారు. ఏప్రిల్ 11న ఇద్దరు యువకుల మెడలు నరికి చంపారు. మయన్మార్ సైన్యం నవంబర్ 2023లో అరాకన్ ఆర్మీ రెబెల్ గ్రూపులపై పోరాటం మొదలుపెట్టాక ఆ ప్రాంతంలో అలజడి తలెత్తినా, సామాన్య ప్రజలను చంపడం ఇదే మొదటి ఘటన.

‘‘అరాకన్ ఆర్మీతో యుద్ధం చేయడానికి మయన్మార్ సైనిక పాలకులు అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ, అరాకన్ రోహింగ్యా ఆర్మీ సభ్యులకు సైనిక శిక్షణ ఇచ్చారు’’ అని తన ఉనికి బైటపెట్టడానికి ఇష్టపడని ఓ అధికారి వివరించారు.

రోహింగ్యా ఉగ్రవాద గ్రూపులు తాము చెరపట్టిన హిందువుల, బౌద్ధుల ఇళ్ళను లూటీ చేసి, తగులబెట్టేస్తున్నారు. ప్రస్తుత సైనిక పాలకులు మతపరమైన విభేదాలు సృష్టిస్తున్నారనీ, వాటి ఉచ్చులో పడవద్దనీ ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులకు స్థానిక తిరుగుబాటుదారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

2017లో రోహింగ్యా ఇస్లామిక్ ఉగ్రవాదులు మయన్మార్‌లోని రాఖైన్ రాష్ట్రంలో వంద మందికి పైగా హిందువులను ఊచకోత కోసి చంపేసాయి. ఆ సంఘటనపై ఆమ్నెస్టీ ఇంటర్నేషన్ సమగ్ర దర్యాప్తు కూడా చేపట్టింది.