
అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి దేవస్థానం క్షేత్ర పాలకుడు శ్రీ సీతారామచంద్రస్వామివారి జన్మనక్షత్రం పునర్వసు సందర్భంగా రామాలయంలో జన్మనక్షత్ర పూజలు, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గంటలకు రత్నగిరి రామాలయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుల మూలవిరాట్టులకు పంచామృతాభిషేకాలు చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు సీతారాములకు పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు.
వధూవరులుగా నేడు అలంకరణ
సీతారాములను వధూవరులను చేసే కార్యక్రమంతో రత్నగిరిపై శ్రీరామ నవమి వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4.30 గంటలకు రామాలయంలో సీతారాములను వధూవరులను చేసే కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. ఇందులో భాగంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు పెళ్లిపెద్దలుగా ఆలయం నుంచి ఊరేగింపుగా రామాలయానికి విచ్చేస్తారు. అనంతరం సీతారాములను ఒక సింహాసనం మీద, దాని పక్కన మరో సింహాసనంపై సత్యదేవుడు, అమ్మవారిని వేంచేయించి, పండితులు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ముత్తయిదువలు శుభం కోరుతూ పసుపు దంచుతారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ కె.రామచంద్ర మోహన్, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొంటారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. రామాలయం పక్కనే ఉన్న వార్షిక కల్యాణ మండపంలో ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ నెల 24వ తేదీ రాత్రి శ్రీపుష్పయాగంతో శ్రీరామ నవమి వేడుకలు ముగుస్తాయి. మొత్తం తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా రత్నగిరి రామాలయం వద్ద చలువ పందిరి వేశారు. ఆలయానికి రంగులు వేసి, విద్యుద్దీప తోరణాలతో అలంకరించి, సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.





