ArticlesNews

ఎదుగుతున్న భార‌త్‌ – వణుకుతున్న పాశ్చాత్య మీడియా

68views

సమర్థ నాయకత్వంలో భారతదేశం నానాటికీ శక్తిమంతంగా ఎదుగుతుంటే ఓర్వలేని శక్తులకు మన దేశంలో కొదవలేదు. ఇలాంటి శక్తులను ఎప్పటి నుంచో ఊతంగా చేసుకున్న పాశ్చాత్య మీడియా ఈనాటికీ భారత్ లక్ష్యంగా కుట్రపూరిత రాతలు రాస్తోంది. భౌతికమైన బానిసత్వం నుంచి మన దేశం ఏనాడో బయటపడినప్పటికీ… ఎరలు వేసి మానసిక బానిసలను తయారు చేస్తూ వీరితోనూ మన దేశానికి వ్యతిరేకంగా రోత రాతలు రాయిస్తోంది. భారత్‌లో ఏ చిన్న సానుకూల పరిణామం చోటు చేసుకున్నా వక్ర భాష్యాలు చెబుతూ.. చెప్పిస్తూ పలు దశాబ్దాలుగా పాత్రికేయ ప్రమాణాలలో పాశ్చాత్య మీడియా తిరోగమన తీరును ప్రదర్శిస్తోంది. వక్రబుద్దే సోపానంగా.. మానసిక బానిసలే ఆయుధాలుగా ఈ పాశ్చాత్య మీడియా చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని సీనియర్ జర్నలిస్ట్, రచయిత ఉమేష్ ఉపాధ్యాయ తన Western Media Narratives on India – From Gandhi to Modi” పుస్తకం ద్వారా బట్టబయలు చేశారు. గాంధీ జీ కాలం నుంచి మోదీ జీ పాలన వరకూ భారత్ విషయంలో పాశ్చాత్య మీడియా అనుసరిస్తున్న విషరాతల సంస్కృతిపై దృష్టి సారించిన ఈ పుస్తకం గురించి సంవిత్ కేంద్ర ఆధ్వర్యంలో శనివారం నాడు హైదరాబాదులోని అపర్ణ సైబర్ కమ్యూన్ క్లబ్ హౌస్‌లో అర్థవంతమైన చర్చ, ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా రచయిత ఉమేష్ ఉపాధ్యాయ ప్రస్తావించిన పలు అంశాలు యువతరాన్ని స్పందింపజేశాయి.

జాత్యహంకారమనేది వివిధ రూపాల్లో నేటికీ కొనసాగుతోందన్న ఉమేష్ ఉపాధ్యాయ… భారతీయ మస్తిష్కాలలో బానిస మనస్తత్వాన్ని నింపడమే లక్ష్యంగా పాశ్చాత్య శక్తులు పనిచేస్తున్నాయని అన్నారు. ఇందుకు ఆ శక్తులు పాశ్చాత్య మీడియాను ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ మన దేశం సాధించిన ఏ ఘనతయినా పాశ్చాత్య మీడియా ప్రతికూల కోణంలోనే వార్తలు, కథనాలను ఇవ్వడం మనం గమనించవచ్చన్నారు. ఇందుకు సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలైన The Wall Street Journal, Reuters, The Washington Post, TIME, BBC, The Guardian, The Telegraph, తదితర ఇంగ్లీష్ మీడియాలో ప్రచురించిన పలు వార్తలు, కథనాలను ఉదహరించారు. వివిధ రంగాల్లోని భారత విజయాలపై రంధ్రాన్వేషణ చేసి… పాశ్చాత్య శక్తుల అజెండాకు అనుగుణంగా వక్రీకరించి, ప్రజాభిప్రాయాన్ని తప్పుదోవ పట్టించేలా ఈ సంస్థలు వార్తలు, కథనాలను అందించడాన్ని గుర్తు చేశారు.

ఇస్రో కీర్తిని విశ్వవ్యాప్తంగా రెపరెపలాడించిన చంద్రయాన్-3 ఘనవిజయంపై నేపథ్యంలో… భారతదేశంలో మౌలిక సదుపాయాల కొరత ఉందని, పేదరికం తాండవిస్తోందని, 70 కోట్లమంది భారతీయులకు ఇప్పటికీ టాయిలెట్ సదుపాయం లేదని… అలాంటప్పుడు స్పేస్ మిషన్ పై ఇంత ఖర్చ అవసరమా అని బీబీసీ పాత్రికేయుడొకరు ప్రశ్నలు సంధించడాన్ని ఉపాధ్యాయ ప్రస్తావించారు. ప్రపంచానికి భారత విజయాన్ని తక్కువ చేసి చూపేలా, కుట్ర కోణంతో కూడిన ఇలాంటి ఉదంతాలు పాశ్చాత్య మీడియా నుంచి ఎన్నో కనిపిస్తాయన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా డెల్టా వేరియంట్‌ని ఇండియన్ వేరియంట్ అని సంబోధించిన పాశ్చాత్య మీడియా… కరోనా కలకలానికి కారణమైన చైనా లేదా అక్కడి వుహాన్ ప్రాంతాల ప్రస్తావన కూడా చెయ్యలేదని గుర్తు చేశారు. అంతేగాక, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సీన్ అందించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ విశాల హృదయాన్ని గుర్తించేందుకు సైతం ఆ మీడియాకు మనసు రాలేదన్నారు. పాకిస్తాన్ లేదా బ్రిటన్, ఇటలీ తదితర ప్రభుత్వాల గురించి పాశ్చాత్య మీడియా ప్రస్తావించేటప్పుడు “ఇస్లామిక్ లేదా క్రిస్టియన్ ప్రభుత్వాలు” అనడం జరగదని, అయితే 2014లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బీజేపీ సర్కారును “హిందూ గవర్నమెంట్” అనడాన్ని ఉమేష్ ఉపాధ్యాయ నిలదీశారు.

భారత్‌కు సంబంధించిన నాగరికత, సాంస్కృతిక అంశాల్లోనూ హిందువులను నిరుపేదలుగా, అజ్ఞానులుగా చూపించే పాశ్చాత్య మీడియా క్రైస్తవానికి సాంస్కృతికంగా ఉన్నత స్థానాన్ని ఆపాదించి, తమ మత ప్రచారం ద్వారా ప్రపంచానికి నాగరికతను నేర్పే బాధ్యత చర్చికి ఉన్నట్టుగా వార్తాకథనాలను నివేదించడాన్ని సైతం ఉమేష్ ఈ చర్చా వేదిక దృష్టికి తీసుకువచ్చారు. ఇక నిజాం కబంధ హస్తాల నుంచి హైదరాబాద్ విముక్తి కోసం జరుగుతున్న పోరాటంలో ప్రజల పక్షాన ఉన్న నాటి భారత హోంమంత్రిని దూకుడు స్వభావం గల వ్యక్తిగాను, నిజాం రాజును బాధితునిగాను చూపించడం నాటి పాశ్చాత్య మీడియాకే చెల్లిందన్నారు. నాటి బ్రిటిష్ పార్లమెంట్, అక్కడి చట్టసభల సభ్యులు భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఐక్యరాజ్య సమితికి లాగడంపై అప్పటి పాశ్చాత్య మీడియా ఏ మాత్రం ప్రశ్నించలేదన్నారు. సమాచారాన్ని పాశ్చాత్య మీడియా తమ గుప్పిట్లోనే ఉంచుకుని పశ్చిమ దేశాల ప్రయోజనాలకు అనుగుణమైన అభిప్రాయాలను నిర్మించేలా మలుచుకుంటూ సవాళ్లు విసురుతున్నాయని… ఈ పరిస్థితుల్లో ఏఐ టెక్నాలజీ సైతం కీలక పాత్ర పోషిస్తున్నదని ఉమేష్ అన్నారు.

పాక్ నగరం కరాచీలో గాంధీ విగ్రహం ధ్వంసమైనప్పుడు ఆటల్లో భాగంగా విరిగిందని రాయిటర్స్ పేర్కొనగా నిజం చెప్పిన పీటీఐతో ఒప్పందాన్ని మార్చుకోవడం… ఆసియా క్రీడల్లో భారత్ 100కు పైగా పతకాలు సాధించి అంతకుముందు ఎడిషన్ కంటే గణనీయమైన పురోగతితో దూసుకెళ్లినప్పుడు ఇంతేనా అంటూ రాయిటర్స్ చేసిన పరిహాసపూరిత వ్యాఖ్యలు, ఆదరణ పొందిన సోషల్ మీడియా అకౌంట్స్‌ని అల్గారిథమ్స్‌తో ఆ సంస్థలు నియంత్రిస్తున్న తీరు వంటి పలు అంశాలతో వేదికను వేడెక్కించారు ఉమేష్. భారత జీడీపీ 16, 17 శతాబ్దాల్లోనే ప్రపంచ జీడీపీలో 25%గా ఉండగా… బ్రిటిష్ పాలన వచ్చాక ఇది కేవలం 4 శాతానికి పతనం కావడాన్ని ఎత్తిచూపారు.

చర్చా కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నకు ఉమేష్ బదులిస్తూ ప్రభుత్వాలకు అధికారాలు పరిమితంగా ఉంటాయి కనుక, భారతీయ సమాజం తనదైన మీడియా ప్రాజెక్ట్‌లు, సంస్థలతో ముందుకువచ్చి, భారతీయ ఉన్నతిని ప్రపంచానికి చాటాలని, తద్వారా పాశ్చాత్య కుట్రలను తిప్పికొట్టాలని రచయిత పిలుపునిచ్చారు. ప్రత్యేకించి పాఠకులు, వీక్షకులు మీడియా ఎడిటర్లకు తమ లేఖలు, అభిప్రాయాల ద్వారా స్పందనలు తెలియజేయడం ఎంతో ముఖ్యమన్నారు.

అంతకుముందు నేషనల్ బుక్ ట్రస్ట్ సభ్యులు, సీనియర్ జర్నలిస్ట్ జి.వల్లీశ్వర్ మాట్లాడుతూ భారతీయులు స్వశక్తితో ఎదగడాన్ని పశ్చిమ దేశాలకు ఆమోదయోగ్యం కాదన్నారు. పాశ్చాత్య మీడియా కథనాలలో సైతం ఇదే దృష్టికోణం కనిపిస్తుందని చెప్పారు. ముఖ్యంగా అమెరికా మీడియాను ప్రస్తావిస్తూ వైజ్ఞానిక పరిశోధనా రంగంలో భారత్ ఒక సూపర్ పవర్‌గా ఎదగడాన్ని సహించలేకపోతోందన్నారు. అక్కడి మీడియా ప్రచురణలు, ప్రసారాల్లోనూ ఈ తీరును చూడవచ్చన్నారు. భారతదేశంలో ఒక సాధారణ వ్యక్తి ఎదుగుదలను ఫ్యూడల్ శక్తులు భరించలేవని, ఈ అసహనం యుఎస్ మీడియాలో కనిపిస్తోందని వల్లీశ్వర్ పేర్కొంటూ ఉమేష్ ఉపాధ్యాయ రచన ఈ పరిణామాన్ని మరింతగా వివరించిందన్నారు.

ఈ కార్యక్రమానికి సంవిత్ కేంద్ర అధ్యక్షులు రాహుల్ శాస్త్రి అధ్యక్షత వహించగా సంస్థ కార్యదర్శి నడింపల్లి ఆయుష్ వందన సమర్పణ చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రపై ప్రచురించిన గ్రంథాల్లో రజాకార్ల దురాగతాలను ప్రస్తావించలేదని, నాడెవరూ దానిని ప్రశ్నించలేదని ఆయుష్ ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మౌనం ప్రమాణంగా మారే పరిస్థితి ఉత్పన్నం కాకూడదన్నారు. సంవిత్ కేంద్ర చేపట్టిన ఇంటింటి ప్రచారంతో సెప్టెంబర్ 17 (హైదరాబాద్ విముక్తి)వ తేదీని కేంద్రం గుర్తించిందని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం భాగ్యనగర చరిత్రపై పరిశోధన కొనసాగుతోందంటూ ఔరంగజేబు కూల్చిన ఆలయాలు ఈ ప్రాంతంలో ఎన్నో ఉన్నాయన్నారు. సంవిత్ కేంద్ర సామాజిక రాజకీయ వ్యవస్థ, ఆర్థిక విధానాలు, చరిత్ర, నాగరికత తదితర రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేస్తూ సంస్థ కార్యకలాపాలను వివరించారు.