ArticlesNews

పంచ మహాయజ్ఞాలు

246views

యజ్ఞం అనగానే సాధారణంగా వేదబ్రాహ్మణులు చేసే క్రతువే మనకు స్ఫురిస్తుంది. కానీ మన ధర్మగ్రంథాలు దేవ, పితృ, భూత, మనుష్య, బ్రహ్మ- అనే పంచ మహాయజ్ఞాలను ప్రస్తావించాయి. వాటిని అందరూ పాటించాలని ప్రబోధించాయి.

దేవయజ్ఞం : నిత్యం భగవంతుడికి పూజ చేసి, ధూప హారతి, కర్పూర హారతి ఇవ్వటం వల్ల దేవతలు తృప్తి చెందుతారు. ఇది దేవయజ్ఞం. సృష్టి కారకుడైన ఆ సర్వేశ్వరుణ్ణి తలచుకొని కృతజ్ఞతలు చెప్పటమే దీని ముఖ్యోద్దేశం.

పితృయజ్ఞం : మన జన్మ, పురోభివృద్ధికి కారకులైన తల్లిదండ్రులను ప్రేమాదరణలతో చూసుకోవడం పితృయజ్ఞం. వారి రుణం తీర్చుకోవటానికి చేసే క్రతువిది. అలాగే మరణించిన తాతముత్తాతలు, వంశీయులు మనకు పితృదేవతలు. వారి పేరిట చేసే దానధర్మాలు కూడా పితృయజ్ఞంలో భాగమే.

భూతయజ్ఞం: పశుపక్ష్యాదులు, క్రిమి కీటకాలు మన మీద ఆధారపడి ఉన్నాయి. భూతదయతో వాటి సంరక్షణపై శ్రద్ధ వహించాలి. మూగజీవాలకు అపకారం తలపెట్టకపోవటం, వాటిపై ప్రేమ, ఆదరణ చూపటం భూతయజ్ఞం.

మనుష్య యజ్ఞం: అతిథి, అభ్యాగతులను ఆదరించటం మనుష్య యజ్ఞం. ఉన్నదాన్ని ఇరుగుపొరుగు వారితో పంచుకోవటం ధర్మం. మన శక్తి సామర్థ్యాలకు తగ్గట్లు అవసరంలో ఉన్నవారికి సేవచేయటం ఈ యజ్ఞ లక్ష్యం.

బ్రహ్మయజ్ఞం: వేదాలు, రామాయణ, భారత, భాగవతాలను పఠించటం బ్రహ్మయజ్ఞం. దీనికి రుషియజ్ఞం అని కూడా పేరు. స్వాధ్యాయం చేయటం కూడా ఇందులో భాగమే! ధార్మిక గ్రంథాలను చదవడం, వినడం స్వాధ్యాయమే!

చక్రి