ArticlesNews

ప్రకృతి ప్రేమికులు పరమాత్మ స్వరూపులు శ్రీపాకలపాటి గురువుగారు

411views

( మార్చి 6 – శ్రీపాకలపాటి గురువు వర్థంతి )

ప్రకృతి భగవంతుని వ్యక్తరూపం. ప్రకృతితోనే భగవంతుని దర్శించే యోగులలో శ్రీపాకలపాటి గురువులు ప్రముఖులు. పాకలపాటి గురుదేవులు 1911 జూన్ 11 విరోధినామ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధపౌర్ణమి ఆదివారం జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు-జంగారెడ్డిగూడెం దారిలో ముండూరు అగ్రహార వాస్తవ్యులైన దామరాజు గంగరాజు, వెంకమ్మగార్ల మూడవ సంతానంగా జన్మించారు. ఈయన అసలు పేరు వెంకటరామయ్య. అందరూ బాబుగారు అని సంబోధించేవారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆయన మేనత్త వద్ద పెరిగారు. చిన్నతనము నుంచి ఆయన ముఖము బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతూ ఉండేది. తన 5వ ఏటనే భాగవత, భారత, రామాయణ గ్రంథాలను కంఠస్థం చేశారు. పాకలపాటి గురుదేవులను పర్వతాలు, అరణ్యాలు చిన్నతనము నుంచే ఆకర్షించేవి. ఈ క్రమంలోనే స్నేహితుడు పుల్లయ్య వద్ద ఆశ్రయం పొందుతున్న పాకలపాటి గురువుగారు ఒక రాత్రి చెప్పాపెట్టకుండా దేశాటనకు వెళ్లారు. అలా కలకత్తా మెయిల్‌లో ప్రయాణిస్తుండగా టికెట్ లేని కారణంతో పాకలపాటి గురువుగారిని టీసీ నర్సీపట్నంలో దింపేశాడు. తెగిన గాలిపటంలా బాబుగారు ఊళ్లు, కొండలు,కోనలు తిరిగారు. కొన్ని సంవత్సరాల తర్వాత బొబ్బిలి సమీపంలోని కలువరాయికి చేరారు. ఆ రోజుల్లో కావ్యకంఠవాశిష్ఠ గణపతి ముని కలువరాయిలో ఉండేవారు. ఆయన వద్దనే బాబుగారు మంత్రదీక్ష పొందారు.

పాకలపాటి గురువుగారు మంత్ర, తంత్ర, జ్ఞానయోగ సాధనల్లో ఆరితేరిన సాధకులే కాదు సామాజిక వివక్షను వ్యతిరేకించిన ఆదర్శవాది. ఆయన భారతదేశంలోనే కాకుండా టిబెట్, బర్మా, రంగూన్, శ్రీలంకలో పర్యటించారు. పట్టణాల కంటె పల్లెలు, పల్లెల కంటే అడవులు, అక్కడి గిరిజనులను ఆయన ఎంతో ఇష్టపడేవారు. వేద, ఇతిహాస, పురాణ, సాహిత్య, జ్యోతిష, మంత్ర మూలికా వైద్య శాస్త్రాలలో ప్రవీణులైన పాకలపాటి గురువుగారు గిరిజనులను పవిత్రహృదయులని, వారు రుషి సంతానమని అనేవారు. కోయలు బాబుగారిని దైవ సమానంగా కొలిచేవారు. పాకలపాటి గురువుగారు బొబ్బిలి సమీపంలోని పిరిడి గ్రామంలో కొంతకాలముండి యువకులను చేరదీసి వారికి భజనలు నేర్పారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఆరు సంవత్సరాలు ఉండి చుట్టు ప్రక్కల గ్రామాలలో విస్తృతంగా తిరిగారు. 1930 -31 మధ్య కాలంలో నర్సీపట్నం వద్ద లంబసింగి గ్రామం కేంద్రంగా చుట్టుప్రక్కల 12 గ్రామాల్లో ఆశ్రమాలను స్థాపించారు. కిటిమల నుండి అడ్డసరం వరకు వందకు పైగా గ్రామాలు పర్యటించి గిరిజనులకు ఆపద్భాందవులయ్యారు. తర్వాత నర్సీపట్నం వద్ద పాకలపాడులో స్థిరపడి ‘పాకలపాటి గురువు’గా పేరు పొందారు.

పాకలపాటి గురువులు పండితులైనా సాహిత్యగోష్ఠులకు స్వస్తి చెప్పి నర్సీపట్నం అడవుల్లోని భీమసింగి గ్రామంలో ఆశ్రమం స్థాపించారు. వీరు గిరిజనులలో భక్తిప్రవత్తులు కలిగించి, ఆరోగ్య, భోగభాగ్యాలను ప్రసాదించారు. వారిలోని దురలవాట్లను మాన్పించి సన్మార్గులను చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములను వెదికి, ఆధునిక వ్యవసాయం నేర్పారు. దాదాపు 300 పల్లెలలో వ్యవసాయ పద్ధతులను గిరిజనులకు నేర్పారు. అలాగే 900 గ్రామాల్లో దేవాలయాలు స్థాపించారు. వీరు మంచి వైద్యులు. గిరిజనుల అనారోగ్యం రూపుమాపేవారు. ఈతిబాధలతో వచ్చిన వారిని ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలకు పరిష్కారపూర్వకంగా సలహాలిచ్చి వారందరికీ ఆత్మీయులయ్యారు. పట్టుదల, నిర్భీకత వారి విశేష గుణాలు. వారి తపస్సు సాధనల వల్ల క్రూరమృగాల మధ్య ధైర్యంగా సంచరించేవారు. ఎంతమంది వారి ఆశ్రమానికి వచ్చినా అందరికీ లేదనకుండా భోజనం పెట్టేవారు. వారు నిర్వహించే ధార్మిక ప్రసంగాలకు వేల సంఖ్యలో గిరిజనులు వస్తుండేవారు. అమాయకులైన గిరిజనులు రుషుల వంటి వారనీ, వారి భక్తి-నాగరికులు చేసే పాపాలకు, అధర్మానికీ విరుగుడనీ, భూభారం సమతుల్యం పాటించడానికి గిరిజనుల పుణ్యమే కారణమని గురువుగారు అంటుండేవారు.

గిరిజనులు ప్రధానంగా కోయలు పాకలపాటి గురువులను ఇప్పటికీ కొలుస్తారు. శ్రీపాకలపాటివారు 1970 మార్చ్ 6న శివైక్యం చెందారు. గురువుగారు తన శరీరం చాలించినా స్థూలరూపంలో దర్శనమిచ్చి తన భక్తులకు అండగా నిలిచేవారు. గురుదేవుల వల్ల అనేక వందల కోయగూడేలకు ఎంతో మేలు జరిగింది. ఆయన తన మౌనమైన జీవితం ద్వారా, నిస్వార్థమైన సేవ ద్వారా ఎన్నో వందల గిరిజనగూడేలకు మేలు చేకూర్చారు. పాకలపాటి గురువులగారి ఆశ్రమం విశాఖపట్నం నర్సీపట్నం మండలం బలిఘట్టం దగ్గర ఉంది. అక్కడ ప్రతీ శివరాత్రి నాడు మహా ఉత్సవము జరుగుతుంది. చుట్టుపక్కలవారే కాకుండా దూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆశ్రమాన్ని దర్శించుకుంటారు. పాకలపాటి గురువుగారు వంటి మహానుభావులు ఈనాటికీ మన దేశంలో పుడుతూ ఉండడం వల్లే ఈ దేశం పుణ్య భూమి అనిపించుకుంటోంది.