
కర్నూలు జిల్లాలోని మిడ్తూరు మండల కేంద్రమైన మిడుతూరులో లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయ నిర్మాణం చేపట్టినప్పటి నుంచి గాలిగోపురం లేదు. దీంతో వందల ఏళ్లుగా గ్రామంలో మేడిమిద్దెల నిర్మాణం చేపట్టడం లేదు. ఐదారుగురు ధైర్యం చేసి ఆలయ గర్భగుడికంటే ఎత్తులో మిద్దెలు నిర్మించుకున్నా ఆర్థికంగా నష్టపోవడంతో వాటిని వీడారు. పోలీసు క్వార్టర్స్ నిర్మాణం చేపట్టినా ఎవరూ నివాసం ఉండక పోవడంతో శిథిలావస్థకు చేరాయి. వందల ఎకరాలు మాన్యం భూములు ఉన్నప్పటికీ ఆలయానికి గాలిగోపురం నిర్మించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దశాబ్దాల తర్వాత గ్రామానికి ఉన్న శాపం వీడేలా తిరుమల తిరుపతి దేవస్థాలు-టీటీడీ సహకారమందించడంతో చొరవతో గ్రామస్తులు రూ.38 లక్షల విరాళాలు సేకరించారు. ఆ మొత్తాన్ని టీటీడీకి చెల్లించారు. ఈవో సహకారంతో టీటీడీ నుంచి రూ.1.52 కోట్లు మంజూరయ్యాయి. మూడేళ్లుగా కొనసాగుతున్న పనులు పూర్తి కావచ్చాయి. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రతిష్టాపన వేడుకలు నిర్వహించనున్నారు.





