News

ఆదిత్యా.. ఆదాయం ఇంతేనా..?

232views

రథసప్తమి నాడు రూ.500కు విక్రయించిన విశిష్ట దర్శనం టికెట్లు 1,010 అమ్ముడుపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఒక టికెట్‌పై ఇద్దరు చొప్పున ఉదయం 7.30 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతించారు. ఆ క్యూలైనులో 2,020 మందే దర్శనం చేసుకున్నట్లు లెక్క. ఆ లైను ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీగానే ఉంది.

రూ.100 టికెట్లు 7,430 మంది మాత్రమే తీసుకున్నారు. క్యూలైను కూడా గురువారం రాత్రి 12 గంటల నుంచి శుక్రవారం రాత్రి ఆలయం మూసే వరకు కిటకిటలాడింది.

రూ.500 క్షీరాభిషేకం టిక్కెట్లు కేవలం 2,400 మాత్రమే అమ్ముడుపోయాయి. గురువారం రాత్రి 12.30 నుంచి ఉదయం 7.30 గంటల వరకు ఆ లైనులో భక్తులకు గంటల తరబడి నిరీక్షణ తప్పలేదు.

అరసవల్లి సూర్యనారాయణస్వామి క్షేత్రంలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవాలకు గతేడాది కంటే ఈసారి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సుమారు లక్ష మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఏటా రథసప్తమి రోజున రాత్రి 11 గంటలకే ఆలయాన్ని మూసేస్తారు. రద్దీ దృష్ట్యా ఈ ఏడాది 12 గంటలకు దాటిన తరువాత కూడా తెరిచి ఉంచారు. భక్తులు పోటెత్తడంతో ఆలయానికి రూ.50,90,530 ఆదాయం సమకూరింది. విశిష్ట, ప్రత్యేక దర్శనం, కేశఖండన శాల టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, విరాళాల రూపంలో గతేడాది కంటే రూ.2.55 లక్షల అదనపు ఆదాయం వచ్చిందని ఈవో డి.ఎల్‌.వి.రమేష్‌బాబు ఆదివారం ప్రకటించారు. టికెట్ల విక్రయాల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని, ఇచ్చిన టికెట్లు చింపకుండా మళ్లీ వాటినే అమ్మి అదనపు సొమ్ముతో జేబులు నింపుకొని ఆదాయానికి రూ.లక్షల్లో గండి కొట్టారని ఆరోజే ఆరోపణలు వినిపించాయి. పలువురిని ఉచితంగా వీఐపీ వరుసల్లో దర్శనాలకు పంపారని విమర్శలు వెల్లువెత్తాయి. అధికారులు వెల్లడించిన గణాంకాలు చూస్తుంటే వాటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

రథసప్తమి రోజున సుమారు లక్షకుపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అందులో క్షీరాభిషేకం, విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వీఐపీ టికెట్ల ద్వారా ఆయా క్యూలైన్లలో 32,344 మంది దర్శనం చేసుకున్నట్లు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అంటే మిగిలిన సుమారు 70 వేల మంది భక్తులు వీఐపీ మార్గం, ఉచిత క్యూలో వెళ్లాలి. వీఐపీ మార్గంలో కేవలం ప్రముఖులను మాత్రమే అనుమతించారు. మిగిలిన వేలాది మంది ఉచిత క్యూలో వెళ్లేందుకు ఆస్కారం లేదు.

వృథాగా 753 టికెట్లు
ఆర్డీవో సిఫార్సుపై బ్యాంకు ద్వారా రూ.500 చొప్పున 3,000 టికెట్లు విక్రయించేందుకు అవకాశం కల్పించారు. ఆ టికెట్ల విక్రయాలపై భక్తులకు సరైన సహకారం అందకపోవటంతో 2,247 మందే కొనుగోలు చేశారు. 753 టికెట్లు మిగిలిపోయాయి. అవి కూడా అమ్మేసి ఉంటే రూ.3,76,500 ఆదాయం వచ్చేది. ఈ ఒక్క టికెట్‌ ద్వారానే అంత మొత్తం కోల్పోతే మిగిలిన వాటి ద్వారా ఇంకెంత గండి పండిందో అర్థం చేసుకోవచ్చు.

దాతల పేరిట ఉచితంగా..
దస్త్రాల ప్రకారం ఆలయంలో 1,400 మంది దాతలకే పాసులు జారీ చేయాలి. 1,700కు పైగా బయటకు వచ్చాయి. ఈ లెక్కన 300 పాసులు అదనంగా ముద్రించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో పాసుపై నలుగురి చొప్పున 300 వరకు అదనపు పాసులపై 1,200 మందికి దాతల పేరుతో ఉచిత దర్శనం కల్పించినట్లయింది.